హైదరాబాద్ స్వరూపాన్ని మార్చే హైడ్రాపై రేవంత్ సర్కార్ వేగం పెంచింది. హైడ్రాకు ముఖ్యమంత్రి అధ్యక్షతన గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసింది. హైడ్రాకు ప్రత్యేక కమిసనర్‌తో పాటు పన్నెండు మందితో… పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత… హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర రాజధానికిగా ఉన్న హైదరాబాద్ రోజు రోజుకు విస్తరిస్తుండగంతో దీనికి అనుగుణంగా… పరిపాలన ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువరావాని భావిస్తున్న సర్కార్… దీనికోసం హైడ్రాను తెరపైకి తెచ్చింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ – హైడ్రా తో హైదరాబాద్ రూపు రేఖలు మార్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం…హైడ్రాకు సంబంధించిన విధి విధానాలను ప్రకటించింది.
హైదరాబాద్ అంటే ఇప్పుడు దేశంలో శరవేగంగా అభివృద్ది చెందుతున్న నగరం. తెలంగాణ గుండేకాయలా ఉన్న హైదరాబాద్ రోజు రోజుకు పెరుగుతున్న వృద్దితో తన రూపు రేఖలు మార్చుకుంటుంది. రాష్ట్ర జనాభాలో మూడో వంతు జనాభా కలిగి ఉన్న హైదరాబాద్.. దేశంలోనే అభివృద్ధి చెందిన నగరాల్లో ఉంది.దీంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిచడంతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వానికి ఒక సవాల్ గా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు హైడ్రాను ఏర్పాటు చేసింది రేవంత్ ప్రభుత్వం. ఈ హైడ్రా కు సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్‌గా 12 మందితో గవర్నింగ్ బాడిని ఏర్పాటు చేసింది. ఈ గవర్నింగ్ బాడిలో మున్సిపల్ అడ్మిని స్ట్రేషన్ మంత్రి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్, సంగారెడ్డి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, ప్రభుత్వ, ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ సీపీ తో పాటు హైడ్రా కమిషనర్ సభ్యులుగా ఉంటారు. అయితే హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను ప్రభుత్వం నియమించింది.
గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అవుటర్ రింగ్ రోడ్లు వరకు హైడ్రా పరిధిలోకి వస్తుంది. జీహెచ్ఎంసీతో పాటు, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్తు, పోలీస్ విభాగాలను సమన్వయం చేసుకుని మరింత సమర్థంగా హైడ్రా పని చేయనుంది. ఇప్పుడున్న ఎన్ ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని అందుకు అనుగుణంగా హైడ్రాతో పునర్ వ్యవస్థీకరించింది. జీహెచ్ఎంసీతో పాటు అవుటర్ రింగ్ రోడ్డు వరకు 2 వేల కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పని చేయనుంది. విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలిగించటం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలగింపు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్తు సరఫరాలో హైడ్రా కీలకంగా వ్యవహరించనుంది. హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా హైడ్రా అధికారులను సమన్వయ పరచనుంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాద్యత హైడ్రా పరిధిలోకి రానుంది.