అసెంబ్లీని వాయిదా వేయడం పట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని వాయిదా వేయడం పట్ల మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తప్పుపట్టారు. అసెంబ్లీని ఒక్క నిమిషంలోనే వాయిదా వేయడం చరిత్ర లేదని, దీనిని శాసనసభా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కీలకమైన అంశాలు అసెంబ్లీలో చర్చకు పెట్టినప్పుడు ముందుగానే మంత్రివర్గ సమావేశం పెట్టుకుంటారని అన్నారు. అలా కాకుండా అసెంబ్లీ సమావేశం ఉందనగా గంట ముందు మంత్రి వర్గ సమావేశం పెట్టుకోవడం శోచనీయమని అన్నారు. బీసీ, ఎస్సీ వర్గీకరణ అంశాలు రెండు కూడా ఒకేరోజు పెట్టుకోవాలని ఆత్రుత ఎందుకని వేముల ప్రశాంత్ ప్రశ్నించారు.
రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాన్ని ఒక్క నిమిషంలోనే వాయిదా వేయడం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సమావేశాన్ని వాయిదా వేసి శాసనసభ రూల్స్, ప్రొసిజర్స్ తుంగలో తొక్కారని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ యధాతథంగా అమలు చేయడం కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తోందని చెప్పారు. ప్రాధాన్యత గల అంశాలపై నాలుగు రోజులు చర్చ లేకుండా ఒక్క రోజుల్లోనే ముగించడం ఏమిటని ప్రశ్నించారు. అన్యాయం జరిగితే బీసీల ఐక్యంతో ఇప్పుడు అతిపెద్ద ఉద్యమం మరోసారి రాబోతుందని అన్నారు.
కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో తమకు అనుమానాలు ఉన్నాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వాటిని నివృత్తి కావాలంటే ప్రభుత్వం నాలుగు రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలన్నారు. కీలక అంశామైన బీసీ, ఎస్సీ కుల గణనపై చర్చలు చేపట్టాలని డిమాండ్ చేశారు.