పుష్ప 2 సినిమా టికెట్ల ధరల పెంపుపై దాఖలైన పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. బెనిఫిట్ షో పేరుతో ఒక్కో టికెట్‌కు అదనంగా రూ.800 వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మొదటి 15రోజులు సైతం అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. భారీ బడ్జెట్‌తో సినిమా చిత్రీకరించడంతో టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని మైత్రీ మూవీ మేకర్స్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
టికెట్ రేట్ల పెంపు వల్ల అభిమానులపై భారం పడుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. పెంచిన రేట్ల ద్వారా వచ్చిన ఆదాయంతో నిర్మాత లబ్ధి పొందుతున్నారని చెప్పారు. బెనిఫిట్ షో కేవలం హీరో అభిమాన సంఘాలకు మాత్రమేనని, అందుకే రేట్లు పెంచినట్లు నిర్మాత తరపు న్యాయవాది తెలిపారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం..తదుపరి విచారణను డిసెంబరు 17వ తేదీకి వాయిదా వేసింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ నిర్దేశించిన విధంగానే టికెట్ల ధరలు కొనసాగనున్నాయి.