అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఓ చిన్న కౌంటీలో కౌంటింగ్ కూడా పూర్తయ్యింది. న్యూహ్యాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం కూడా వచ్చేసింది. అక్కడ మొత్తం ఆరుగురు ఓటర్లు ఉండగా.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మూడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నకు మూడు ఓట్లు వచ్చాయి. 2020లో మాత్రం డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ వైపు డిక్స్‌విల్లే నాచ్ ఓటర్లు మొగ్గుచూపారు. ఆ ఎన్నికల్లో ఆయనే విజయం సాధించడం విశేషం.
అమెరికా అధ్యక్షున్ని ఆ దేశ ప్రజలు నేరుగా ఎన్నుకోరు. ఆ దేశ అధ్యక్ష ఎన్నకల్లో ఎలక్టోరల్ కాలేజ్ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో 270 వచ్చిన అభ్యర్థి ప్రెసిడెంట్ అవుతారు. ఒకవేళ ఇద్దరికీ 269 ఓట్లే వస్తే, రిజల్ట్ టై అవుతుంది. ఓటర్లు ఈ ఎలక్టోరల్ కాలేజీ మెంబర్స్‌కే ఓట్లు వేస్తారు. వీరిని ఎలక్టర్లు అంటారు. వీరందరూ డిసెంబర్ 16న సమావేశమై అధ్యక్షునికి, ఉపాధ్యక్షునికి ఓటేస్తారు.