Oscars 2023 | ఒక్క మెట్టు పైకి ఎక్కగలిగితే చాలు…ఆటోమేటిక్ గా అన్ని మెట్లు ఆ పక్కనే ఉంటాయి. ఒకదానిపై ఒకటి అలా వెళ్లిపోవడమే.. కానీ ఆ ఒక్క మెట్టు ఎక్కడం దగ్గరే…ఎన్నో కష్టాలు… అసలు అక్కడ ఒక నిచ్చెన ఉందని, దానిపై నుంచి వెళితే అదృష్టం వరిస్తుందని చాలామందికి తెలీదు. తెలిసినవాళ్లు ఆ ఒక్క మెట్టు ఎక్కి, ఇక చాలులే అని ఆగిపోతారు. కానీ దీపికా పదుకునే అలా కాదు…37 సంవత్సరాల వయసులో కూడా వన్నె తగ్గని అందంతో, సూపర్ హిట్ సినిమాలతో, అంతర్జాతీయ వేదికలపై మెరుస్తూ అత్యంత వేగంగా దూసుకు వెళ్లిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటని అనుకుంటున్నారా? మార్చి 12న జరగనున్న ఆస్కార్ అవార్డు వేదికపై మన భారతీయ అందాల నటి దీపికా పదుకునే తళుక్కుమని మెరవనుంది. విషయం ఏమిటంటే ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే అతిథుల జాబితాలో దీపికా పేరు కూడా చేరడం విశేషం. మన ఇండియా నుంచి దీపికాకి మాత్రమే ఆహ్వానం అందింది.
ఈ ఆస్కార్ అవార్డుల తేదీ కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే మన ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ పాట షార్ట్ లిస్ట్ అవడంతో…ఇక ఆ రోజు వేదికపై ప్రకటించడమే తరువాయిగా మారింది. అవార్డు వచ్చినా రాకపోయినా…నాటు-నాటు పాటను ఆస్కార్ వేదికపై పాడమని ఆ పాట పాడిన సింగర్స్ ఆహ్వానం అందింది. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ అంతా బయలుదేరి వెళుతోంది.
Oscars 2023 | ఆల్రడీ ‘నాటు-నాటు’ పాటకు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఇక ఆస్కార్ లో కూడా ఈ పాటకే వస్తుందని అందరూ ఘంటాపథంగా చెబుతున్నారు. గోల్డెన్ గ్లోబ్ వచ్చినవాటికే ఆస్కార్ వరించడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇకపోతే దీపికా ఆహ్వానం వెనుక రకరకాల వ్యాక్యానాలు ఉన్నా, మన భారత దేశ చిత్రాలకి అవార్డులు వచ్చినా, రాకపోయినా మన దేశం నుంచి ఒక విశిష్ట అతిథిని ఆస్కార్ కి ఆహ్వానించడం ఆనవాయితీ. అందులో భాగంగానే దీపికాకి పిలుపు వచ్చిందని అంటున్నారు.
ఇంతకుముందే దుబాయ్ లో జరిగినా ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ పోటీల్లో కూడా ప్రపంచ కప్ ను తీసుకువచ్చే బాధ్యతను దీపిక పైనే పెట్టారు. అంతటి గౌరవం పొందిన ఏకైక భారతీయ నటిగా దీపికా ప్రశంసలు అందుకుంది. అంతేకాదు 2022లో ప్రతిష్టాత్మకమైన ‘కాన్స్’ జ్యూరీలో కనిపించిన దీపికా కు ఆస్కార్ వేదికపై ప్రజంటేటర్ మరొక సువర్ణావకాశం అని చెప్పాలి. మొత్తానికి ఒక భారతీయ మహిళ చిత్రపరిశ్రమలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి చేరి భారతదేశ కీర్తిని చాటిచెప్పడంలో తన పాత్ర మరువలేనిదని చెప్పాలి. అయితే ఈ క్రమంలోనే దీపికా విమర్శలు కూడా ఎదుర్కొంది. బాలీవుడ్ అగ్రనటుడు షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన దీపికా శృతి మించి చేయడం వివాదస్పదమైంది. భారతీయ కీర్తిని దశదిశలా చాటిచెప్పే అవకాశం వచ్చిన దీపికా…భవిష్యత్తులో భారతీయ పరిపూర్ణ వనితగా నిలవాలని అందరూ కోరుకుంటున్నారు.
View this post on Instagram