తొలకరి వానలు రాకముందే నకిలీ విత్తనాల బెడద మొదలైంది. సరిహద్దు రాష్ట్రాల నుంచి నకిలీలతో వ్యాపారులు వచ్చేస్తున్నారు. గ్రామాల్లో రైతులను మోసగించి వ్యాపారులు విక్రయాలు సాగిస్తున్నారు. ఏదో ఒక బ్రాండ్ పేరట నకిలీలు రైతులకు అంటగడుతున్నారు. నకిలీ విత్తనాల విక్రేతలపై పీడీ యాక్ట్ ప్రయోగి స్తామని పోలీసు అధికారులు చెబుతున్నా, ఆచరణలో సాధ్యం కావడం లేదు. అందువల్ల రైతులూ అప్రమత్తంగా ఉండండని, వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
వానాకాలం సీజన్ మొదలైంది. రైతులు విత్తనాల సేకరణలో నిమగ్నమయ్యారు ప్రభుత్వం విత్తనాలను విక్రయించడం లేదు. దీంతో రైతులకు పేరొందిన కంపెనీల విత్తనాలను తక్కువ ధరకే ఇస్తామని నమ్మిస్తూ వ్యాపారులు గ్రామాలలోకి వచ్చి నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బైంసా, బోథ్ ఉట్నూరు తదితర డివిజన్లలో ఈ నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. జన్నింగు మిల్లుల నుంచి తెచ్చిన పత్తి గింజలు మార్కెట్లలో కొన్న మొక్కజొన్నలు, మిరప గింజలు సాధారణ పద్ధతుల్లో సేకరించిన విత్తనాలకు విత్తన శుద్ధి మందులను పట్టించి అందమైన కవర్లు, డబ్బాల్లో నింపి ప్రముఖ కంపెనీల పేరిట, కొత్త కంపెనీ విత్తనాలు అని రైతులకు అంటగడుతు న్నారు. అసలైన విత్తనాల డబ్బాలపై, బస్తాలపై పూర్తి వివరాలు లేబుల్ రూపంలో ఉండాలి. బ్యాచ్ నెంబర్ ఉండాలి. కానీ నకిలీ విత్తనాలకు ఏమీ ఉండవు. కొందరు ఏజెంట్లను పెట్టుకొని అక్రమంగా అమ్మకాలు సాగిస్తున్నారు. తక్కువ ధర అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మిస్తూ నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు.
విత్తనాల విక్రయాల సందర్భంగా వాటికి రసీదు ఇవ్వడం లేదు. నకిలీ విత్తనాల దందా కట్టడి చేసేందుకు ప్రభుత్వం దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నా ఆగడం లేదు. దీంతో అమాయక రైతులు నష్టపోతున్నారు. నకిలీ విత్తనాలు మొలకెత్తినా పైరు ఎదగదు. చీడపీడలను తట్టుకోలేదు. విత్తనాలు నాటిన తర్వాత పది రోజుల తర్వాతనే ఇవి నకిలీవి అని గుర్తించ గలుగుతారు. అప్పుడు రైతులు మోస పోయినట్లు గుర్తించినా ఆ విక్రయదారుడు జాడ తెలియదు. ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఛత్తీస్ గఢ్, గుజరాత్ నుంచి నకిలీ విత్తనాలను రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినా వ్యాపారులు అనేక విధాలుగా తెలంగాణ రాష్ట్రా నికి నకిలీ విత్తనాలను తీసుకొస్తు న్నారు. అధిక శాతం రైళ్ల ద్వారానే ఈ నకిలీ విత్తనాలు రవాణా అవుతు న్నాయి. ప్రముఖ విత్తన కంపెనీలు పక్కాగా నాణ్యత పరీక్షలు నిర్వహించి తర్వాతే మార్కెట్లోకి విత్తనాలను విడుదల చేస్తాయి అయితే ఈ పరీక్షల్లో విఫలమైన విత్తనాలను కొందరు వ్యాపారులు సేకరించి ఏదో ఒక బ్రాండ్ పేరిట రైతులకు అంటగడుతున్నారు దీని వల్ల రైతులు అప్పుల పాలై ఆత్మ హత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది కనుక సంబంధిత అధికారులు ఈ నకిలీ విత్తనాల బెడద నుంచి కాపాడాలని కోరుతు న్నారు రైతులు.


