ED makes another arrest in Delhi liquor scam: Accused linked to AAP s Goa Election Campaign: తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పెద్ద తలకాయల పేర్లు ఒకొక్కటీ బయటకు వస్తున్నాయి. విచారణల పేరుతో ఇంతకాలం వచ్చి వెళ్లిన ఈడీ అధికారులు నెమ్మదిగా ఛార్జిషీట్ ఫైల్ చేసి… ఒకొక్కరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో చారియట్ మీడియాకు చెందిన రాజేష్ జోషీని ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మద్యం కేసులో నగదును ఒకచోటు నుంచి మరొక చోటుకి తరలించారనే ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
ప్రస్తుతం ఆయన్ని సీబీఐ ప్రత్యేక కోర్టుకి తరలించనున్నారు. ఈ క్రమంలోనే మద్యం పాలసీని తమకు అనుకూలంగా డిజైన్ చేయడంలో కీలక పాత్ర పోషించిన గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేసిన ఒక్కరోజులోనే మరొకరు రాజేష్ జోషిని అరెస్ట్ చేశారు. ఇవి ఇలాగే కొనసాగుతాయని అంటున్నారు. మద్యం వ్యాపారులతో గౌతమ్ మల్హోత్రాకి సత్సంబంధాలు ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారని అంటున్నారు.
అంతకుముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును ఇంతకుముందే సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని, పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని ఇటీవల అరెస్ట్ చేసింది. ఇదే క్రమంలో కవితను కూడా ఈడీ అధికారులు విచారించడం చర్చనీయాంశమైంది.ఇప్పుడిదే క్రమంలో ఆమె మాజీ ఆడిటర్ ను తీసుకెళ్లడం సంచలనం రేపింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరును కూడా చేర్చారు. గోవా, పంజాబ్ ఎన్నికల కోసమే ‘ఆప్’ ఈ దందాలో తలదూర్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఆప్ మీడియా వ్యవహారాల ఇంచార్జి విజయ్ నాయర్ ఏకంగా సీఎం కేజ్రీవాల్ కి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఇతని సిఫారస్ మేరకే ఇండో స్పిరిట్ లో 65 శాతం కవిత, మాగుంట శ్రీనివాసరెడ్డి ఇద్దరికీ ఇచ్చినట్టు ఈడీ ఛార్జిషీట్ లో పేర్కొంది. కవిత రూ.3 కోట్ల 40 లక్షలు, మాగుంట రూ.5 కోట్లు ఇండో స్పిరిట్లో పెట్టుబడులు పెట్టినట్టు తెలిపింది. కవిత తరపున అరుణ్ పిళ్లై, మాగుంట తరపున ప్రేం రాహుల్ ఇండోస్పిరిట్ లో ప్రతినిధులుగా ఉన్నారని ఈడీ పేర్కొంది.
మొత్తానికి తీగలాగుతుంటే బడాబడా బాబులంతా బయటకు వస్తున్నారు. నోటీసులు ఇస్తే ఎవరూ పెద్దగా స్పందించలేదు. ముందుగా విచారించి, తర్వాత వారిని కస్టడీలోకి తీసుకున్నారు. దీంతో నెక్స్ట్ ఎవరు? అని అందరిలో ఆసక్తి మొదలైంది,