స్వతంత్ర వెబ్ డెస్క్: గణేష్ నిమజ్జన సామూహిక ఊరేగింపుల పర్యవేక్షణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇలా దాదాపు 12 వేల విగ్రహాలను ట్యాగ్ చేశారు. పోలీసులు గణేష్ విగ్రహాల వివరాలతో పోలీసులు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించి అందిస్తున్నారు.
ఇలా ఈ విగ్రహాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు ఐసీసీసీలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించారు. ఈ క్యూఆర్ కోడ్స్, జియో ట్యాగింగ్ డేటాను పోలీసు అధికారిక యాప్ టీఎస్ కాప్‌లోకి లింకు ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు ఏర్పాటు అవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను తమ ట్యాబ్స్, స్పార్ట్‌ఫోన్స్‌లో చూసుకునే అవకాశం ఏర్పడింది.
సామూహిక నిమజ్జనం గురువారం జరగనుండటంతో నగర కొత్వాల్ సీవీ ఆనంద్ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. మంగళవారం ఆయన అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, జి.సుదీర్‌బాబు, సంయుక్త సీపీ ఎం.శ్రీనివాసులు తదితరులతో కలిసి చార్మినార్, ఎంజే మార్కెట్ సహా వివిధ ప్రాంతాల్లోని ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు మొత్తం 19 కిమీ మేర ప్రధాన ఊరేగింపు జరగనుంది. ఈ మార్గంలో అనేక ఇతర ఊరేగింపులు వచ్చి కలుస్తాయి.
బందోబస్తు, భద్రతా విధుల్లో మొత్తం 25,694 మంది సిబ్బంది, అధికారులు పాల్గొంటారు. వీరికి అదనంగా 125 ప్లటూన్ల సాయుధ బలగాలు, మూడు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వినియోగిస్తున్నారు. ఈ బలగాలు హుస్సేన్‌సాగర్ చుట్టూతో పాటు 18 కీలక జంక్షన్లలో మోహరించి ఉంటాయి. ప్రతి ఊరేగింపు మార్గాన్ని ఆద్యంతం కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవసరమైన సంఖ్యలో క్యూఆరీ్ట, యాంటీ చైన్ స్నాచింగ్, షీ–టీమ్స్ బృందాలతో పాటు డాగ్ స్వాడ్ లను రంగంలోకి దింపుతున్నారు. ఐసీసీసీలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఈ ఊరేగింపును పర్యవేక్షిస్తారు. నగర ప్రజలు సైతం తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.