తెలంగాణలో పోలీసు వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కిరణ్… మలక్‌పేటలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కి ఉరివేసుకుని కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాసేపటికి గమనించిన బంధువులు అతడిని యశోద ఆస్పత్రికి తరలించగా… అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మలక్‌పేట ఎస్ఐ నవీన్ దర్ తెలిపారు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తగాదా ఉందని ఈ నేపథ్యంలోనే కిరణ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
నేరాలను నియంత్రించి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన పోలీసులే మనోధైర్యాన్ని కోల్పోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. సమస్యలకు పరిష్కారం వెతుక్కోకుండా ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత కారణాలు కావొచ్చు.. ఇతర సమస్యలు కావొచ్చు అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చూసుకుంటే పోలీసుల వరుస ఆత్మహత్యలు డిపార్ట్‌మెంట్‌ను కలవరపెడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో 8 మంది చనిపోయారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
డిసెంబర్ 4న ములుగు జిల్లా వాజేడులో ఎస్సై హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక కామారెడ్డి జిల్లాలో జరిగిన ఆత్మహత్యలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. బిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట కానిస్టేబుల్ శృతి.. అడ్లూరు పెద్ద చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నారు. వీరితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ కూడా చనిపోవడం కలవరపాటుకు గురి చేసింది. డిసెంబర్ 29న మరో ఇద్దరు పోలీసులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెదక్ జిల్లాలో ఈ ఘటనలు జరిగాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, డిపార్ట్‌మెంట్‌లో ఒత్తిడి, వివాహేతర సంబంధాలు ఆత్మహత్యలకు కారణమని తెలుస్తోంది.
ఇలా వరుస పోలీసుల ఆత్మహత్యలపై డిపార్ట్‌మెంట్ దృష్టి పెట్టింది. వారెందుకు ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారో ఫోకస్ చేసింది. ఆత్మహత్యలకు కారణాలపై ఆయా జిల్లా యూనిట్స్ అధికారుల నుంచి సమగ్ర రిపోర్ట్ సేకరిస్తోంది. ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే కారణాలపై దృష్టి పెట్టింది. వారికి తగిన కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది.