అనంతపురం నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులు దగ్ధమయ్యాయి. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్దమయ్యాయి. బస్సులపై కేవీ 11 వైర్ తెగి నిప్పురవ్వలు పడడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు చుట్టుపక్కల వ్యాపించాయి. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో 4 బస్సులు దగ్దమయ్యాయి.
ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున జరిగింది. బస్సుల వద్ద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై జేసి కుటుంబం ఇంత వరకు స్పందించలేదు. బస్సులు పూర్తిగా స్క్రాప్ అయిన నేపథ్యంలో జేసి కుటుంబం దీనిపై స్పందించలేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించిన కారణాలు పోలీసుల విచారణ లో తెలియాల్సి ఉంది.