స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలో రాజకీయ వాతారణం వేడెక్కింది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పార్టీలు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పొత్తులపై జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికార వైసీపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించగా.. టీడీపీ, జనసేన పొత్తులతో వెళ్లాలని డిసైడ్ అయ్యాయి. అంతేకాదు బీజేపీ కూడా తమతో కలిసి వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా కొద్దిరోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే షా, నడ్డా రాష్ట్ర పర్యటనలు చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం శ్రీకాళహస్తిలో పర్యటించారు. బీజేపీ మహాజన సంపర్క్ అభియాన్ సభలో పాల్గొన్న నడ్డా.. మోదీ తొమ్మిదేళ్ల పాలనను ప్రజలకు వివరించడంతో పాటు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో అభివృద్ధి నిలిచిపోయి స్కామ్‌లు నడుస్తాయని మండిపడ్డారు. అభివృద్ధితో మోదీ దేశాన్ని పరుగులు పెట్టిస్తుంటే.. జగన్ అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. విశాఖ వేదికగా జరగనున్న సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. నడ్డా బాటలోనే షా కూడా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడతారా? అనేది ఆసక్తిగా మారింది.