24.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్రం సమరయోధుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా శాంతియుతంగా మొదలైన నిరసనలు.. ఊహించని పరిణామాలకు దారి తీశాయి. బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనలతో అక్కడి ప్రభుత్వం వణికిపోయింది. వందలాదిమంది ప్రాణాలు కోల్పోవడంతో చివరికి దేశ ప్రధాని కూడా గద్దెదిగాల్సి వచ్చింది. 1971లో బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రం కోసం పోరాడినవారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపింది. బంగ్లాదేశ్‌ ప్రభుత్వ నిర్ణయం ఆ దేశ ప్రధాని హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీ మద్దతుదారులకే ప్రయోజనం చేకూరుస్తుందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అంతే.. రిజర్వేషన్లు రద్దు చేయాలనే డిమాండ్‌తో విద్యార్థులు రోడ్డెక్కారు.

బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు కూడా 30శాతం రిజర్వేషన్లను 5శాతానికి కుదించాలని ఆదేశిస్తూ కీలక తీర్పు ఇవ్వడంతో హసీనా ప్రభుత్వం అలెర్ట్‌ అయింది. బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు ఆదేశాలను హసీనా ప్రభుత్వం కూడా అంగీకరించింది. దాంతో.. పరిస్థితులు సర్థుకుంటాయని భావించినప్పటికీ.. ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధాని హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ప్రదర్శనలు చేయడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆ ఘర్షణలతో సుమారు 300మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతటితో ఆగని నిరసనకారులు.. గత రెండు రోజుల్లో మరింత రెచ్చిపోయారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని వీధుల్లోకి వేలాది తరలివచ్చి రచ్చ చేశారు. దుకాణాలు, బస్సులకు నిప్పు పెట్టడంతో బంగ్లాదేశ్‌ రగిలిపోయింది. ఢాకా వీధుల్లో నిరసనలు చేస్తూనే ప్రధాని హసీనా అధికార నివాసంలోకి ప్రవేశించి రణరంగం సృష్టించారు. పరిస్థితి చేయి దాటడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి.. దేశం విడిచి వెళ్లిపోయారు హసీనా. దాంతో.. బంగ్లాదేశ్‌ పాలన సైన్యం చేతుల్లోకి వెళ్లింది.

మరోవైపు.. బంగ్లాదేశ్‌ సైన్యం కంట్రోల్‌లోకి వెళ్లడంతో భారత్ అలెర్ట్ అయింది. బంగ్లాదేశ్‌లోని పరిస్థితులు, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌లోని తాజా పరిస్థితులను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ వివరించగా.. అక్కడి పరిణామాలపై లోతుగా చర్చించారు. అదేసమయంలో.. భారత్‌- బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో కేంద్రం హైఅలర్ట్‌ ప్రకటించింది. సరిహద్దుల్లో బలగాలను అప్రమత్తం చేయడంతోపాటు.. భద్రతను కట్టుదిట్టం చేసింది. కూచ్‌బెహార్‌, పెట్రాపోల్‌ సరిహద్దుల్లో భద్రత పెంచింది. సరిహద్దుల దగ్గర భారీగా సైన్యాన్ని మోహరించి.. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే.. భారత్‌లోని బంగ్లాదేశ్‌ ఎంబసీ దగ్గర భద్రత పెంచడంతోపాటు.. బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ కార్యాలయం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు.

బంగ్లాదేశ్‌లో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని సూచించింది. గతకొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో పలువురు మరణించడంపై అమెరికా విచారం వ్యక్తంచేసింది. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ఈ హింసాత్మక ఘటనలపై నిష్పక్షపాత, పారదర్శక దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని తెలిపింది. మరిన్ని ఘర్షణలు జరగకుండా అన్నిపక్షాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.

ప్రధాని షేక్‌హసీనా రాజీనామా సహా బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఐక్యరాజ్య సమితి తెలిపింది. మరిన్ని హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని పిలుపునిచ్చింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది. నిరసన తెలియజేసే హక్కును కాపాడాలని పిలుపునిచ్చింది. తాము బంగ్లాదేశ్‌ సామాన్య ప్రజల పక్షానే ఉన్నామని పేర్కొంది. ఇప్పటివరకు జరిగిన ఘటనలపై దర్యాప్తు జరపాలని కోరింది. పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటామని తెలిపింది.

బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అసవరం ఉందని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అభిప్రాయపడింది. అక్కడ జరిగిన హింసాత్మక ఘర్షణలపై విచారం వ్యక్తంచేసింది. బంగ్లాదేశ్‌లోని సామాన్య పౌరులకు భద్రత, శాంతియుతమైన పాలనను అందించాలని ఆకాంక్షించింది. ఇప్పటి వరకు జరిగిన ఘటనలపై ఐరాస నేతృత్వంలో విచారణ జరగాలని డిమాండ్ చేసింది.

బంగ్లాదేశ్‌లో సరిగ్గా 49ఏళ్ల క్రితం ఇంతకంటే దారుణం జరిగింది. 1975 ఆగస్టులో అప్పటి రాజకీయ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని హసీనా తండ్రి షేక్‌ ముజిబుర్‌ రెహ్మన్‌, అతని ఫ్యామిలీతోపాటు.. 18 సీనియర్‌ సైనిక అధికారులను దుండగులు హత్య చేశారు. దాంతో.. హసీనా, ఆమె భర్త, పిల్లలు ఢిల్లీలో ఉండేందుకు అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సాయం చేసింది. ఇప్పుడు.. సరిగ్గా 49 ఏళ్లకు 10 రోజుల ముందు అదే బంగ్లాదేశ్‌లో దాదాపు సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. బంగ్లాదేశ్‌లో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మహా రాజకీయ సంక్షోభం తలెత్తింది. ముజిబుర్ కుమార్తె హసీనా బంగ్లాదేశ్‌ను వీడి.. భారత్‌కు రావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అప్పటిలాగానే.. హసీనాకు భారత్‌ ఆశ్రయం కల్పించింది. మొత్తంగా.. బంగ్లాదేశ్‌లో ఊహించని పరిస్థితులు ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి భారత్‌కు వచ్చారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుచేయనున్నట్లు సైనికాధిపతి జనరల్‌ వకార్‌-ఉజ్‌-జమాన్‌ ప్రకటించారు.

కాగా, బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడబోయే మధ్యంతర ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనుస్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈరోజు ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. 1940 జూన్ 28న చిట్టగాంగ్‌లో యూనస్ జన్మించారు. ఆర్థికశాస్త్రంలో 2006లో నోబెల్ అవార్డును అందుకుని.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అత్యంత బలోపేతం చేశారు. మైక్రో క్రెడిట్, మైక్రో ఫైనాన్స్‌ రంగంపై గట్టి పట్టు సాధించారు. బ్యాంకింగ్ సేవలను గ్రామణీ ప్రాంతాలకు విస్తరింపజేయడంలో డాక్టర్ మహ్మద్ యూనస్ కీలకంగా పని చేశారు.

అలాగే, 2009లో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్.. 2010లో కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్‌తో సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులను నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ యూనస్ అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక కార్యకలాపాలను చేపట్టడానికి 2011లో యూనస్ సోషల్ బిజినెస్- గ్లోబల్ ఇనిషియేటివ్స్‌ అనే సంస్థను స్థాపించారు. 1969లో ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన యూనస్ డాక్టరేట్ అందుకున్నారు. వాండర్‌బిల్ట్ యూనివర్సిటీలో చదువుకోడానికి ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌ను సైతం పొందారు. విద్యాభ్యాసం ముగిసి తర్వాత మిడిల్ టేన్నెస్సీ స్టేట్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేశారు. అలాగే, చిట్టాగాంగ్ యూనివర్శిటీ ఎకనమిక్స్ హెడ్‌గా కూడా బాధ్యతులను నిర్వర్తించారు.

Latest Articles

ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభం.. ఇక ఇందిరాగాంధీ భవన్‌

ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని అగ్రనేతలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు. ఈ కొత్త భవనానికి ఇందిరాగాంధీ భవన్‌ అని పేరు పెట్టారు. 5 అంతస్తుల్లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్