ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. టీచర్లు-విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కొత్తేమీ కాదని అన్నారు. సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరు మార్చి,…. ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టుగా, వాటిని ప్రచార వేదికలుగా మార్చుకుని చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందంటూ ట్వీట్ చేశారు.
వైసీపీ హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లను,.. విద్యారంగాన్ని ఒకవైపు నాశనం చేస్తూ, అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాశారని విమర్శించారు. రొటీన్‌గా జరిగే పేరెంట్స్ సమావేశాలపై పబ్లిసిటీ చేయించుకోవడం, ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలాంటివి మోసాలు చేయగలరని ఎద్దేవా చేశారు. 15 వేల 715 పాఠశాల్లో మొదటి విడత, 22 వేల 344 పాఠశాలల్లో మలివిడత నాడు-నేడు పనులన్నీ తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే జరిగాయని జగన్ గుర్తు చేశారు. అమ్మ ఒడి కింద ప్రతి తల్లికీ ఏడాదికి రూ.15వేల చొప్పున, క్రమం తప్పకుండా 44 లక్షల మంది తల్లులకు రూ. 26 వేల 67 కోట్లు ఇచ్చామని చెప్పారు.