సమస్త ప్రాణికోటికి జీవనాధారభూతుడైన సూర్యభగవానుడు అన్నప్రదాత, ఆరోగ్య ప్రదాత, సర్వప్రదాత. ధరణిపై ప్రాణికోటి సుభిక్షంగా ఉన్నారంటే..అందుకు కారణం నిస్సందేహంగా సూర్యుడే. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యదేవుని జయంతి రథసప్తమి. దక్షిణాయం నుంచి దిశమారి సూర్యుడు ఉత్తరదిశ ప్రయాణం రథసప్తమి రోజు నుంచే ఆరంభం అవుతుంది. లక్షల దివిటీలు, కోట్లాది కార్చిచ్చులైనా.. సూర్య తేజస్సు ముందు అణుమాత్రమే. అంతటి సూర్యదేవుడు ప్రతి క్షణం పడే కష్టాన్ని గమనిస్తే.. జీవుల కష్టాలు అల్పమాత్రమే.
అలుపు, అలసట, విశ్రాంతి, కష్టాలు, బాధలు.. అనే మాటలనే పట్టించుకోకుండా నిరంతరం కర్తవ్యదీక్షలో సూర్యదేవుడు నిమగ్నమై ఉండి సమస్త జీవకోటిని పరిరక్షిస్తున్నాడు. తూర్పున ఉదయించిన సూర్యుడు పడమర అస్తమిస్తాడు, అంటే సూర్యాస్తమయం అనంతరం మరునాడు ఉదయం వరకు సూర్యుడు విశ్రాంతి తీసుకుంటాడు అనుకుంటే పొరపాటే. ఇక్కడి తూర్పు, పడమరలు, మరోచోట పడమర, తూర్పులు, ఇక్కడ అస్తమయం అనంతరం అక్కడ ఉదయమే కదా.. అక్కడ కర్తవ్యాన్ని నిర్వర్తించాలికదా.. అంటే సూర్యుడు అవిశ్రామంగా, నిరంతరాయం కర్తవ్యదీక్షలో ఉన్నట్టే కదా..
ఇక సూర్యప్రయాణాన్ని గమనిస్తే.. కష్టాలన్నీ కట్టకట్టుకొచ్చి.. ఈ పయనం మీద పడినట్టు ఉంటుంది. సూర్య రథం ప్రయాణించేది.. సాఫీ మార్గంలో కాదు. దారీ, తెన్నూ లేని గగనానికి, ధరణికి మధ్యన.. త్రిశంకు స్వర్గం మాదిరి ఉన్న మార్గంలో సూర్యరథం సాగుతుంది. గుర్రాలు అంటే చంచల మనస్తత్వానికి గుర్తుగా చెబుతారు. సూర్యరథానికి ఉండేవి సప్త అశ్వాలు. ఏ అశ్వం ఏ రీతిలో వెళుతుందో ఎవ్వరికీ తెలియదు. ఆ ఆశ్వాలను సరియైన రీతిలో నడిపించాలి. పోనీ ఆ అశ్వాలను నడిపించే సారథి ఏమైనా దేహదారుఢ్యంతో, కండలు తిరిగిన మహా బలవంతుడా అంటే అదీ కాదు. సూర్యుడు రథసారథి అనూరుడు ఊరువులు లేకుండా పుట్టినవాడు. కాళ్లు, తొడలు లేని వ్యక్తి అనూరుడు. అయినా, అనూరుడు. సూర్యుదేవుడి రథన్ని ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటూ అవిశ్రామంగా నడుపుతాడు. సమస్త జగత్తును సూర్యుడు కాపాడడంలో అనూరుని పాత్ర అమోఘం.
తెల్లవారితే చాలు వెలుగులతో విస్పష్టంగా దర్శనమిచ్చే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుని జన్మదినం..రథసప్తమి అంటే భక్తులు ఎంత భక్తిశ్రద్ధలు ప్రదర్శిస్తారు. రథసప్తమి సందర్భంగా సర్వవ్యాప్తంగా సూర్యదేవ పూజలు, ఆరాధనలు వైభవోపేతంగా జరిగాయి. సూర్య దేవాలయాలన్ని భక్తులతో కిటికటలాడాయి. దేశంలోని అతి ప్రసిద్ధ, ప్రాచీన ఒడిశా కోణార్క సూర్యదేవాలయానికి విశ్వం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.
ఏపీలోని అరసవెల్లి, గొల్లలమామిడాడ తదితర సూర్యదేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన దేవాలయాల్లో ఉపాలయాలుగా ఉన్న సూర్య దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అరసవిల్లి సూర్య దేవాలయంలో ఆకాశం నుంచి సూర్యకిరణాలు రథసప్తమి రోజున నేరు ఆలయ గర్భగుడిలోని మూలవిరాట్ పాదాలను తాకడం జరుగుతుంది. ఇది దైవ మహిమకు తార్కాణమని భక్తులు చెబుతారు. ఇక తిరుమలలో రథసప్తమి నాడు మాత్రమే ఏక దినాన సప్తవాహన సేవలు జరుగుతాయి. ప్రభాత సమయాన సూర్యప్రభా వాహనంతో.. తిరుమలలో మలయప్పస్వామివారి వాహనసేవ అద్భుత రీతిలో ఆరంభం అవ్వడం ఆనవాయితీ. అనంతరం చిన్న శేషవాహనసేవ, గరుడ వాహనసేవ, హనుమంత వాహన సేవ అనంతరం చక్రస్నానం జరుగుతాయి. ఇక రాత్రి కల్పవృక్షవాహన సేవ, సర్వభూపాల వాహనసేవ, చంద్రప్రభా వాహనసేవతో రథసప్తమి వాహనసేవలు ముగుస్తాయి.
సూర్యదేవుని రథసప్తమి ఆరాధనలో స్నానానికి ప్రముఖ పాత్ర ఇచ్చారు. సప్త అశ్వాలకు చిహ్నంగా ఏడు జిల్లేడు ఆకులు, ఏడు రేగు పండ్లు శిరస్సుపై పెట్టుకుని సూర్యజయంతి నాడు సూర్య శ్లోకాలు చదువుతూ స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు పటా పంచలు అవుతాయని, అపార పుణ్యఫలాలు లభిస్తాయని తెలియజేస్తున్నాయి. భాస్కరా, దివాకరా, ఆదిత్యా, మార్తాండా, జగద్రక్షకా అంటూ సూర్యదేవుని ప్రార్థిస్తూ రథసప్తమి వేడుక నిర్వహించుకుంటారు. ఇక్ష్వాక వంశం అంటే సూర్యవంశం. ఈ సూర్యవంశపు రాజులలో సాక్షాత్ శ్రీమహావిష్ణువు శ్రీరామచంద్రునిగా జన్మించి, అయోధ్యాపురాధీశుడిగా రామరాజ్య పాలన చేశాడు. అంతటి శ్రీమన్నారాయణుడు, ప్రత్యక్ష నారాయణుడైన సూర్యనారాయణుని సప్తాశ్వరథమారూఢం అంటూ…ప్రార్థనలు చేసి..దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడు.
ఇక సూర్యదేవునికి సమర్పించే పరమాన్న ప్రసాదం గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. సూర్యదేవునికి దంతాలు పరిపుష్టికరంగా ఉండని కారణంగానే మెత్తగా ఉండే పరవాన్నాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాడని భక్తులు చెబుతారు. ఇందుకు సంబంధించిన ఓ ఆసక్తికర పురాణ కథనాన్ని వివరిస్తూ ఉంటారు. దక్షప్రజాపతి శివధిక్కారం చేసి దక్షయజ్ఞం అనే క్రతువు జరిపిస్తున్న సందర్భంలో.. దక్షుని ప్రథమ కుమార్తె జగజ్జనని కాత్యాయనీ మాత ఆ క్రతువులో అవమానానికి గురై మంటలకు ఆహుతై తనువు చాలిస్తుంది. దీంతో, పరమశివుడు ప్రళయాకాళ రుద్రునిగా మారి శివతాండవ చేస్తాడు.
శివుని జటాఝూటం నుంచి వీరభద్రుడు ఉద్భవిస్తాడు. దక్షయజ్ఞాన్ని భంగం చేయమని వీరభద్రునికి శివుడు ఆదేశిస్తాడు. దీంతో. శరభ, శరభ, అశ్శరభ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా గర్జన చేస్తూ.. దక్షయజ్ఞాన్ని భగ్నం చేయడానికి వీరభద్రుడు బయలుదేరతాడు. అయితే. ఆ యాగశాలలో ముందు వరసలో కూర్చున్న సూర్య, చంద్రులు.. వీరభద్రునికి నచ్చచెప్పపోతారు. యజ్ఞవాటిక శ్మశానవాటికగా మార్చడం తగదని హితవు పలుకుతారు. శివాజ్ఞనే ధిక్కరిస్తారా అంటూ వీరభద్రుడు..వారిపై సమరానికి సిద్దం అవుతాడు. ఈ నేపథ్యంలో వీరభద్రుని కాఠిన్య హస్తాలు, మృదమదురమైన సూర్యుడి బుగ్గలు తాకడంతో..ఆయన పళ్లు బలహీన పడినట్టు.. ఈ కారణంగానే గట్టి పదార్థలు ఆయన నమలలేనట్టు, ఇందుకే మెత్తని పరమాన్నాన్ని ఆయనకు ప్రసాదంగా పెడతారని భక్తులు చెబుతూంటారు. అయితే, ఇవేమీ పవిత్ర పురాణ గ్రంధాల్లో మాత్రం కనిపించవు.
తన శక్తి తనకు తెలియని కార్యదక్షుడు, అపర రామభక్తుడు, మహా బలవంతుడు ఆంజనేయుడు. హనుమంతుడు బాల్యాన్ని గమనిస్తే..ఆకాశంలో ఎర్రగా కనిపిస్తున్న సూర్యబింబాన్ని చూసి పండుగా భావించి మింగేయడానికి ప్రయత్నిస్తాడు. అపర శక్తిమంతుడైన తననే మింగేయ ప్రయత్నించిన బాలాంజనేయుని చూసి తొలుత భయపడిన సూర్యుడు, తరువాత ముచ్చట పడి ఆశీర్వదిస్తాడు. దీంతో, తనకు సమస్త విద్యలు నేర్పమని సూర్యదేవుని ఆంజనీపుత్రుడు వేడుకుంటాడు. క్షణం తీరిక లేక.. ఆకాశమార్గాన సంచరిస్తూ..సమస్త ప్రాణికోటిని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, తాను చదువు ఎలా చెప్పగలనని సూర్యుడు అంటారు. బాల హనుమంతుడు పట్టు విడవకుండా భానుడిని పరిపరివిధాల ప్రార్థించి…ఆకాశయాన రథప్రయాణం సాగిస్తూనే తనకు విద్యలు నేర్పాలని…ఏ దిక్కుకు తిరిగినా తాను ఆ దిక్కుకు వచ్చి విద్యాభ్యాసం చేస్తానని, గురుదేవుని కర్తవ్యదీక్షకు భంగం కల్గించనని బాలాంజనేయుడు కోరతాడు. దీంతో, సూర్యుడు బుజ్జి హనుమంతుని పట్టుదలకు సంతసించి..సకల శాస్త్రాలు, సమస్త విద్యలను సూర్యుడు, హనుమంతునికి బోధిస్తాడు.