చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తాం..! త్వరలోనే రెడ్ బుక్ మూడో చాప్టర్ తెరుస్తాం..! యూఎస్ పర్యటనలో మంత్రి నారా లోకేష్ చేసిన హెచ్చరికలు ఇవి. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన లోకేష్.. ఇప్పటికే పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తే రెడ్ కార్పెట్ పరుస్తామని వెల్లడించారు. అట్లాంటాలో పర్యటించిన మంత్రి లోకేష్.. నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు లోకేష్. అమెరికాలో ఉన్న వాళ్లని ఎన్‌ఆర్‌ఐలుగా కాకుండా… ఎంఆర్ఐలుగా అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్ అని పిలుస్తానన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరు తెలుగువారిది అంటూ చెప్పుకొచ్చారు మంత్రి.
రెడ్ బుక్‌లో రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని.. త్వరలోనే మూడోది తెరుస్తామన్నారు మంత్రి లోకేష్. యువగళం పాదయాత్రలో తనను చాలా ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. రెడ్ బుక్‌కు భయపడుతున్న జగన్… గుడ్ బుక్ తీసుకొస్తానంటున్నారని అన్నారు. కానీ, అందులో ఏం రాయాలో వైసీపీ అధినేతకు అర్థం కావడం లేదని సెటైర్లు వేశారు మంత్రి నారా లోకేష్.