అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య సమన్వయలోపం బయటపడింది. ఎన్నికలప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ సమన్వయంతో పనిచేస్తేనే కూటమిలోని టీడీపీ ఎమ్మెల్యేగా శిరీషదేవి గెలిచారు కానీ.. ఇప్పుడు నియోజకవర్గంలో కూటమిలోని మూడు పార్టీల మధ్య సమన్వయం లోపించిందని బీజేపీ జిల్లా కార్యదర్శి సోళ్ల బొజ్జిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిరీషదేవి నుండి కూటమి సభ్యులకు కనీసం సమాచారం ఇవ్వకుండా తనకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తమను నమ్మి ఓటు వేసిన ప్రజలు ఎమ్మెల్యేని కలవలేని పరిస్థితి ఉందన్నారు.
ఎమ్మెల్యే శిరీష అందుబాటులో లేకపోవడం క్యాంపు కార్యాలయంలో ఆమె భర్త విజయ్ భాస్కర్ ఉండడంతో ప్రజా సమస్యలు ఎమ్మెల్యేకు చెప్పుకోలేని పరిస్థితి ఉందని రంపచోడవరం నియోజకవర్గం బీజేపీ నాయకులు మీడియాకు చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే లిఖిత పూర్వకంగా నియోజకవర్గం సమస్యలు ముఖ్యమంత్రికి, కేంద్రానికి తెలియజేస్తామని బొజ్జిరెడ్డి తెలిపారు.
ఎన్డీఏ కూటమిలో మిరియాల శిరీషదేవిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించామని బొజ్జిరెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే కార్యాలయంలో కానీ, ఆమె వద్ద కానీ కూటమి సభ్యులకు విలువ లేదని ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, కార్యకర్తల సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్దామంటే ఆమె అందుబాటులో ఉండరన్నారు. ఆ స్థానంలో ఎమ్మెల్యే భర్త విజయ్ భాస్కర్ తన ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారి ఆవేదన వ్యక్తం చేశారు.
మరో వైపు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నామినేటెడ్ పదవులు సైతం వారికి అనుకూలంగా ఉన్నవారికే కేటాయించి, బీజేపీ నాయకులను విస్మరిస్తున్నారని బొజ్జిరెడ్డి వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీలు తెలుగుదేశానికి 60 శాతం, జనసేనకు 30 శాతం, బీజేపీకి 10 శాతం చొప్పున నామినేటెడ్ పోస్టులు కేటాయించింది. అయినప్పటికీ రంపచోడవరం నియోజకవర్గంలో అలా జరగడం లేదని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కచ్చితంగా ఎమ్మెల్యే, ఆమె భర్త తీరుపై అధిష్టానానికి తెలియజేస్తామని ఆయన హెచ్చరించారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటినప్పటికీ రంపచోడవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకూ సమన్వయ కమిటీ ఏర్పాటు చెయ్యలేదని బీజేపీ కార్యదర్శి కృష్ణారెడ్డి అన్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో కూటమి సభ్యులను సంప్రదించకుండా అనుకూలంగా ఉన్నవారికి పదవులు కేటాయించారని ఆరోపించారు. ఎమ్మెల్యే కార్యాలయానికి సీనియర్ నాయకులు వెళ్ళినప్పటికీ ఎమ్మెల్యే శిరీషదేవి అందుబాటులో ఉండరన్నారు. ఆమె భర్త విజయ్ భాస్కర్ కూటమి సీనియర్ నాయకులను గంటల తరబడి పడిగాపులు కాయిస్తున్నారని మండిపడ్డారు. కూటమి సభ్యులను చిన్నచూపు చూస్తూ వారికి నచ్చినట్టు వెళ్లడం సరైన పద్ధతి కాదని కృష్ణారెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే శిరీషదేవి కూటమి నాయకులను కలుపుకొని ముందుకు వెళ్లాలని, లేని పక్షంలో అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని అన్నారు కృష్ణారెడ్డి.