నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోంది. ట్రింకోమలికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 770 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. నేడు తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు ఫెంగల్‌గా నామకరణం చేశారు అధికారులు. పుదుచ్చేరి-చెన్నై మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు తుఫాన్ గండం పొంచి ఉంది. దీంతో తుఫాన్ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. కడలూరు, మైలాడుదురై, తిరువారూర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించంది. ఇప్పటికే తీవ్రవాయుగుండం తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. నాగపట్నం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడలూరు, మైలాడుదురై, తిరువారూర్‌లోనూ జోరు వానలు దంచికొడుతున్నాయి దీంతో చెన్నై సహా 9 జిల్లాలను అలర్ట్ చేసిన అధికారులు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలతో నాగపట్నం జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 48 గంటలపాటు అతి భారీవర్షాలు కురిసే అవకాశముండంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
అలాగే తుఫాన్ నేపథ్యంలో ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాగల 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశముందని తెలిపింది. రాగల 48 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే చాన్స్ ఉందని అలర్ట్ చేసింది. ఈనెల 30 నుంచి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాన్ ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. అన్నిజిల్లాల కలెక్టర్లు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.