తెలుగు రాష్ట్రాల్లో పులి పంజా విసురుతోంది. రక్తాన్ని రుచి మరిగిన టైగర్లు.. పశువులనే కాదు, మనుషులపై దాడి చేసి చంపుకుతింటున్నాయి. అడవుల్లో ఉండాల్సిన ఈ వన్యప్రాణి జనావాసాల్లోకి వచ్చి తమపై దాడి చేస్తోంటే గజగజ వణికిపోతున్నారు జనం. ఒంటరిగా బయటకు వెళ్లాలంటే బాబోయ్ పులంటూ హడలెత్తిపోతున్నారు.
ముఖ్యంగా అడవువు జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లో పులి సంచారం దడ పుట్టిస్తోంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ మహిళపై పులి దాడి చేసి ప్రాణాలు తీసింది. పులి దాడిలో యువతి ప్రాణాలు కోల్పోయింది. కాగజ్‌నగర్ మండల పరిధిలోని గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మిని పులి పొట్టనబెట్టుకుంది. పతి ఏరడానికి చేనులోకి వెళ్లిన లక్ష్మీపై.. వెనుక నుంచి సడి చప్పుడు లేకుండా వచ్చి దాడి చేసింది. ఊహించని పరిణామంతో యువతి పులిని ప్రతిఘటించలేకపోయింది. దీంతో పులి మహిళ మెడ భాగంలో తీవ్రంగా దాడి చేసింది. గమనించిన మిగతా కూలీలు కేకలు వేశారు. పులి అక్కడి నుంచి పారిపోయింది. అయితే,.. దాడిలో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మీ ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. ఈ ఘటనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.
ఇకపోతే ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే.. పశువుల మందపై దాడి చేసింది పులి. ఈ ఘటన వాంకిడి మండల పరిధిలో జరిగింది. అలాగే బోథ్ మండలం బాబెర తాండలోనూ చిరుతపులి సంచారం హడలెత్తిస్తోంది. గ్రామంలో అర్ధరాత్రి మేకల మందపై దాడి చేసింది. ఈ దాడిలో నాలుగు మేకల మృతి చెందాయి. మేకల అరుపులకు గ్రామస్థులు మేల్కొన్నారు. గ్రామస్తుల అలికిడితో చిరుతపులి పారిపోయింది. చిరుతపులి సంచారంతో గ్రామస్థులు భయభ్రంతులకు గురవుతున్నారు.
మనిషి నెత్తురు మరిగిన పులి జాడ కోసం ఆసిఫాబాద్ జిల్లాలో ఆపరేషన్ కొనసాగుతోంది. 15 గ్రామాల్లో ఈ సెర్చ్ ఆపరేషన్ నడుస్తోంది. దీంతో కాగజ్‌నగర్ కారిడార్‌లో హై అలర్ట్ నెలకొంది. 90 మంది అటవీశాఖ సిబ్బందితో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పులిని బంధించేందుకు 30కిపైగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక పులి సంచారం దృష్ట్యా 15 గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రజలు
అటు ఏపీలోని పలు జిల్లాల్లోనూ టైగర్ టెన్షన్ పెట్టిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో పులి సంచారంతో వణికిపోతున్నారు అక్కడి జనం. కోట బొమ్మాళి సమీపంలో రోడ్డు దాటుతుండగా 108 సిబ్బంది కంటపడింది పులి. అర్థరాత్రి సమయంలో ఈ ఘటన జరగగా.. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు డైవర్. అలాగే వాట్సాప్ గ్రూపుల్లోనూ పోస్ట్ చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. దీనిపై స్పందించి ఫారెస్ట్ సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని పెద్ద పులి అడుగుల జాడలను గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఒంటరిగా పొలం పనులకు వెళ్లొద్దని.. గుంపులుగా వెళ్లాలని తెలిపారు.
మనిషి తన స్వార్థం కోసం అడవులను నరికివేస్తూనే ఉన్నాడు. అడవుల సంరక్షణకు ఎన్ని నిబంధనలు పెట్టినా వాటిని తుంగలో తొక్కుతూ నాశనం చేస్తున్నారు. దీంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి పరుగులు పెడుతున్నాయి. పులి టెన్షన్ మాత్రమే కాదు.. ఎనుగుబంట్లు ఏనుగుల గుంపు ఇలా అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు ఊర్లల్లోకి వచ్చి దాడులు చేస్తున్నాయి.