స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రబాబు కాపులను అడుగడుగునా మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా బాబు మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు గతంలో 10 శాతం కూడా హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో కాపుల సంక్షేమానికి రూ. 39,247కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువగా చేశామన్నారు. గత ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
ఈ మేరకు సీఎం జగన్ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో లబ్ధిదారులకు ‘వైఎస్సార్ కాపు నేస్తం’ నాలుగో విడత ఆర్థిక సాయాన్ని అందిచే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఇటీవలే అవినీతి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు అరెస్టయ్యారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇన్ని అక్రమాలు, దోపిడీలు చేసిన బాబును రక్షించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్సిగ్గుగా కొందరు చంద్రబాబుకు సపోర్టు చేస్తున్నారని మండిపడ్డారు. చట్టం ఎవరికైనా ఒక్కటేనని అన్నారు.
45 ఏళ్లుగా దోపిడీని చంద్రబాబు రాజకీయంగా మార్చుకున్నారని సీఎం జగన్ విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ బాబు అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. కేసులో ఆడియో టేపుల్లో బ్లాక్‌మనీ పంచుతూ పట్టుబడ్డారని ప్రస్తావించారు. ఆ ఆడియో బాబుదే అని ఫోరెన్సిక్ కూడా నిర్ధారించిందని.. కానీ బాబు మాత్రం అది తనది కాదని బుకాయించారని గుర్తుచేశారు. తానేం తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారని అన్నారు.
ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అన్న వారు ప్రశ్నించరు. ఎల్లో మీడియా నిజాలను చూపించదు. చంద్రబాబు అవినీతిపై మాట్లాడదు. 371 కోట్ల రూపాయల జనం సొమ్ము ఎక్కడికిపోయింది. చంద్రబాబు నడిపిన కథలో ఆయన్ను కాకుండా ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాలి?. అని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.