ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేక పోయింది. ప్రధానంగా బీజేపీ బోలెడు ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్లో కమలం పార్టీ విజయావకాశాలకు గండి పడింది. ఫలితంగా మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాల్లో కమలం పార్టీ కేవలం 33 సీట్లకే పరిమితమైంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ – కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి మెజారిటీ లోక్‌సభ సీట్లు గెలుచుకుంది.
ఉత్తరప్రదేశ్ ఒక్కటే కాదు మహారాష్ట్ర కూడా భారతీయ జనతా పార్టీకి నిరాశ మిగిల్చింది. మహా రాష్ట్రవాసుల ఐడెంటి టీకి ప్రతీకగా అందరూ భావించే శివసేన చీలిపోవడం సగటు మహారాష్ట్ర వాసులు జీర్ణించుకోలేకపోయారు. అంతేకాదు సాక్షాత్తూ శివసేన చీలికవర్గానికి నాయకుడైన ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది బీజేపీ అధిష్టానం. ఈ పరిణామం కూడా మహారాష్ట్ర వాసులకు మింగుడుపడలేదు.అలాగే శరద్ పవార్ స్వంత పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని కమల నాథులు చీల్చడాన్ని కూడా మహారాష్ట్రవాసులు జీర్ణించుకోలేకపోయారు. శరద్ పవార్ సాదాసీదా రాజకీయ వేత్త కాదు. దేశంలోని సీనియర్ రాజకీయవేత్తలలో శరద్ పవార్ ముందు వరుసలో ఉంటారు. మహారాష్ట్ర కేంద్రంగా శరద్ పవార్ రాజకీయ కార్యకలాపాలు ఉన్నప్పటికీ, జాతీయ రాజకీయాల్లో ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది.
ఈ నేపథ్యంలో దాదాపు సంవత్సరం కిందట నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. శరద్ పవార్ సోదరుడి కుమారుడైన అజిత్ పవార్, ఎన్‌సీపీని నిట్టనిలువునా చీల్చారు. దీంతో అజిత్ పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. ఈ పరిణామాలన్నీ సగటు మహారాష్ట్రవాసికి మింగుడుపడ లేదు. అంతిమంగా తాజా లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర లో మెజారిటీ సీట్లు తెచ్చుకోవడంలో ఎన్డీయే కూటమి ఫెయిల్ అయింది. కాగా ఈసారి లోక్‌సభ ఎన్నికలలో కమలం పార్టీని దక్షిణాది రాష్ట్రాలు ఆదరించాయి. భారతీయ జనతా పార్టీని దక్షిణాది అక్కున చేర్చుకుంది. అసలు బలమే లేదని భావించిన ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి భారతీయ జనతా పార్టీ మూడు నియోజక వర్గాలను గెలుచుకుంది. ఏపీలో మూడు సీట్లు గెలుచుకోవడం అంటే చిన్న విషయం కాదు. అలాగే తెలంగాణలో ఎనిమిది లోక్‌సభ సీట్లను కమలం పార్టీ గెలుచుకుంది. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఫలితాలకు ముందు అందరూ అనుకున్నారు. దీనికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరి ఉండటమే. అయితే కాంగ్రెస్‌తో పోటాపోటీగా కమలం పార్టీ ఎనిమిది సీట్లు గెలుచు కుంది.
కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి.ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 17 నియోజకవర్గాలు గెలుచుకుంది. బీజేపీ వరకు ఇది ఘనవిజయం కిందే లెక్క. కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఓటమి పాలైంది. బస్వరాజ్ బొమ్మై పాలనలోని అవినీతి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కీలక అంశంగా మారింది. సీనియర్ నేత సిద్దరామయ్య నాయకత్వాన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఈసారి బీజేపీకి సీట్లు తగ్గుతాయని అందరూ భావించారు. అయినప్పటికీ ఓటమిపాలైన ఏడాది కాలంలోనే భారతీయ జనతా పార్టీ పుంజు కుంది. మాజీ ప్రధాని దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్ సెక్యులర్ పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగింది. ఫలితంగా కర్ణాటకలో బీజేపీ 17 సీట్లు గెలుచుకుంది.
ఈసారి దేవభూమిగా అందరూ పిలిచే కేరళలో తొలిసారి లోక్‌సభ సీటు గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. త్రిస్సూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన సినీ నటుడు సురేశ్ గోపి విజయం సాధించారు. వాస్తవానికి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో ఆరెస్సెస్ శాఖలు ఎక్కువ. అయినప్పటికీ ఒక్కసారి కూడా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టలేదు. దీంతో దశాబ్దాల కమలనాథుల కల సాకారం అయినట్లయింది.అయితే భారతీయ జనతా పార్టీకి తీవ్ర ఆశాభంగం కలిగించిన రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. సహజంగా తమిళనాడులో ఎప్పుడూ ద్రవిడ పార్టీలదే హవా. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ లేదా భారతీయ జనతా పార్టీ ఏదో ఒక ద్రవిడ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి ఒకట్రెండు సీట్లు తెచ్చుకునేవి. ఈసారి జాతీయ పార్టీ అయిన బీజేపీ తమిళనాడులో దాదాపుగా ఒంటరి పోరాటం చేసింది. డీఎంకే లేదా అన్నా డీఎంకే కు సమాన దూరం పాటించింది కమలం పార్టీ. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె. అన్నామలై భుజం మీద బాధ్యతలు పెట్టింది కమలం పార్టీ అధిష్టానం. అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలకు ముందు తమిళనాడులో కనీసం మూడు లేదా నాలుగు సీట్లు గెలుచుకుంటామని కమలనాథులు అంచనాలు వేశారు. అయితే బీజేపీ నాయకుల అంచనాలు తప్పాయి. అంతిమంగా తమిళనాడులో కనీసం ఒక్క సీటు కూడా కమలం పార్టీ గెలుచుకోలేకపోయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగి ఇప్పటికి పదేళ్లు అవుతోంది. ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొంది. గత పదేళ్లుగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రతి సంవత్సరం రూ. 450 కోట్లు ఇస్తామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. అలాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ని పెడతామని విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇప్పటివరకు అమలు కాలేదు. ఈసారి ఎన్నికల్లో దక్షిణాది నుంచి మొత్తం 29 సీట్లు ఎన్డీయే కూటమికి దక్కాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగి ఇప్పటికి పదేళ్లు అవుతోంది. ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొంది.
గత పదేళ్లుగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రతి సంవత్సరం రూ. 450 కోట్లు ఇస్తామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. అలాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ని పెడతామని విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇప్పటివరకు అమలు కాలేదు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విభజన చట్టాల అమలుకు నరేంద్ర మోడీ సర్కార్ చొరవ చూపాల్సి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ డిమాండ్ గతంలోనే తెరమీదకు వచ్చింది. అయితే ఇప్పటివరకు వర్క్ అవుట్ కాలేదు. అలాగే అంధ్రప్రదేశ్‌లోనూ అనేక విభజన హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఈ జాబితాలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాలు అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించడానికి ఇదే సరైన సమయం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.