White Cobra |అది శ్వేతనాగు…మారుమూల కొండ ప్రాంతాల్లో కొలువైన శివుడి గుడి దగ్గర తిరుగాడుతూ ఉంటుంది. అక్కడ గ్రామస్తులందరికీ ఆ విషయం తెలుసు. చాలాసార్లు ఆ శ్వేతనాగుని చూస్తుంటారు…అది సాక్షాత్తూ ఆ పరమశివుడి మెడలో ఉండేదని, కనిపించినప్పుడు భక్తితో నమస్కరించి వెళ్లడం ఒక ఆనవాయితీ అని చెబుతుంటారు.
అనుకోకుండా ఒకరోజు ఆ శ్వేతనాగు అక్కడే ఆ రాతికొండల మధ్యలో ఉన్న బావిలో పడిపోయింది. ఆ రోజు ఉదయం ఒక రైతు అటుగా వెళుతుంటే… నీటిలోంచి శబ్ధం రావడం చూసి వెళ్లి చూస్తే…శ్వేతనాగు అందులో కదలాడుతూ పైకి రాలేక అవస్థలు పడుతూ కనిపించింది.
వెంటనే ఆ రైతు చుట్టుపక్కల గ్రామస్తులకి కబురు చేశాడు. విషయం తెలిసి అందరూ పరిగెత్తుకు వచ్చారు. మొత్తానికి వారంతా కలిసి ఎంతో ధైర్యసాహసాలతో ఆ బావిలో దట్టంగా పెరిగిన ఆ ఊడల మర్రిలు పట్టుకుని, జాగ్రత్తగా దిగి దానిని బయటకు తీసుకువచ్చారు. అయితే అది అట్లాంటి, ఇట్లాంటి నాగు పాము కాదు.. శ్వేతనాగు. దాని విషం చాలా పవర్ ఫుల్.. అందుకనే ఎంతో జాగ్రత్తగా దానిని బయటకు తీశారు.
ఒక్కసారి నేలమీదకు వదిలేసరికి అంతమంది గ్రామస్తులను చూసి శ్వేతనాగు కంగారుపడింది.. అందరిమీదకి ఉరుకుతూ బుసలు కొట్టింది. అయితే చాకచక్యంగా అందరూ తప్పించుకున్నారు. కాసేపటికి తనని కాపాడారనే విశ్వాసంతో శాంతించినట్టుంది. మొత్తానికి అక్కడే ముడుచుకుని సేదతీరింది..
గ్రామస్తులు హమ్మయ్యా.. అనుకుని.. దానికి నెమ్మదిగా అడవిలోకి దారి చూపించారు
అది అటువైపు వెళ్లిపోయింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మాకు శివుడు ఎంత ముఖ్యమో, ఆ శ్వేతనాగు కూడా అంతేనని చెప్పుకొచ్చారు. అందరూ భక్తి శ్రద్ధలతో నమస్కారాలు చేశారు. చక్కగా ఫొటోలు కూడా తీసుకున్నారు.
ఇంతకీ ఇదెక్కడ జరిగిందో చెప్పలేదు కదా..
విజయనగరం జిల్లాలోని లక్కవరపు కోట మండలం రేగ గ్రామం. ఇక్కడే కొండల్లోని రాతికొండ ప్రదేశంలో గుహ లింగేశ్వర స్వామి గుడి ఉంది. అక్కడే ఆ శివాలయం మధ్యలో శ్వేతనాగు కనిపించడం విశేషం.