కొత్త సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌లో ఓ ఘోరం జరిగింది. ఓ వ్యక్తి తన కుటుంబాన్ని దారుణంగా హత్య చేశాడు. లక్నోలోని ఓ హోటల్‌లో ఓ వ్యక్తి తన తల్లిని, నలుగురు అక్కాచెల్లెళ్లను హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్షద్ (24) ఆగ్రాకు చెందినవాడు. కుటుంబ కలహాల కారణంగా అతను తన తల్లి, నలుగురు చెల్లెళ్లను హోటల్‌కు తీసుకెళ్లి అక్కడ హత్య చేశాడు. మరణించిన వారిని అర్షద్ సోదరీమణులు అలియా (9), అల్షియా (19), అక్సా (16), రహ్మీన్ (18)గా గుర్తించారు. తల్లి అస్మాని కూడా చంపేశాడని పోలీసులు తెలిపారు.
లక్నోలోని నాకా ప్రాంతంలోని హోటల్ శరంజిత్‌లో ఈ ఘటన జరిగిందని సెంట్రల్ లక్నో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీనా త్యాగి తెలిపారు. నిందితుడు అర్షద్ (24) తన సొంత కుటుంబానికి చెందిన ఐదుగురిని హతమార్చాడు. ఘటనాస్థలిలోనే నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. సాక్ష్యాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ బృందాలను క్రైమ్ స్పాట్ వద్ద మోహరించినట్లు, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు డీసీపీ త్యాగి తెలిపారు. సమీపంలో ఉన్న హోటల్ సిబ్బందిని కూడా విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. మృతదేహాలపై గాయలు ఉన్నాయని.. ఒకరికి మణికట్టుపై, మరొకరి మెడపై గాయాలు ఉన్నాయని తెలిపారు. సాక్షుల వాంగ్మూలాలు, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ త్యాగి చెప్పారు.