టెక్ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి త్వరలోనే అడుగుపెట్టబోతుందా?.. అమెరికాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన తర్వాత శుభవార్త నిజమేనా!.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో భేటీ తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయా?.. అంటే అవుననే సమాధానం వస్తోంది.
టెస్లా సంస్థ భారత్‌లోకి అడుగుపెట్టేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం పెట్టిన షరతులతో కార్యరూపం దాల్చలేదు. సుంకాలు, ఇతరత్రా కారణాలతో ఆ ప్రణాళికలు మూలనపడ్డాయనే చెప్పాలి. భారత ప్రధాని మోదీ .. అమెరికా పర్యటనలో ఎలాన్ మస్క్‌తో భేటీ తర్వాత కీలక ముందడుగు పడినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ కంపెనీ భారత్‌లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టింది. అంటే భారత్‌లో టెస్లా ఎంట్రీపై సంకేతాలిచ్చినట్టే కదా.
తాజాగా 13 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు కావాలంటూ టెస్లా తమ లింక్డిన్ పేజీలో ఓ ప్రకటన చేసింది. కస్టమర్ రిలేటెడ్, బ్యాక్‌ఎండ్ జాబ్, సర్వీస్ టెక్నీషియన్, అడ్వైజరీ ఉద్యోగాల కోసం అడ్వర్‌టైజ్‌మెంట్ విడుదల చేసింది. కనీసం ఐదు పొజిషన్లకు ఉద్యోగులను ముంబయి, ఢిల్లీ రెండు చోట్లా నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక, కస్టమర్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగులను కేవలం ముంబయి కేంద్రంగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
2021 నుంచి టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఈవీలపై ట్యాక్స్‌లు గణనీయంగా తగ్గించాలని టెస్లా డిమాండ్ చేసింది. ఇందుకు కేంద్రప్రభుత్వం కొన్ని కండిషన్స్ పెట్టింది. దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలు కొనుగోలు చేయాలన్న షరతులు విధించింది. దీనికి ఎలాన్ మస్క్ ససేమిరా అన్నారు. దీంతో టెస్లా ప్రవేశం ఆలస్యం అవుతూ వస్తోంది.
ఈ క్రమంలోనే ఇటీవల 40వేల డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.34లక్షలు కంటే ఎక్కువ ఖరీదైన హైఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 110శాతం నుంచి 70శాతానికి తగ్గించింది. మరోవైపు, గతవారం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీతో మస్క్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సుంకాల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. తాజా పరిణామాలతో త్వరలోనే దేశీయ రోడ్లపై టెస్లా కార్లు చక్కర్లు కొట్టే అవకాశాలున్నట్లు ఆటో రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.