స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్ర తాత్కాలికంగా రద్దయింది. చంద్రబాబు అరెస్ట్ క్రమంలో లోకేష్ విజయవాడకు బయల్దేరారు. పోలీసులు అనుమతి ఇవ్వడంతో చంద్రబాబును చూసేందుకు నేతలతో కలిసి యువగళం పాదయాత్ర క్యాంప్‌సైట్ నుంచి విజయవాడకు బయల్దేరారు.
ప్రస్తుతం కోనసీమ జిల్లాలో లోకేష్ పాదయాత్ర చేస్తుండగా.. చంద్రబాబు అరెస్ట్ క్రమంలో విజయవాడకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో విజయవాడ వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అనుమతి నిరాకరించారు. తన తండ్రిని చూసే హక్కు తనకు ఉంటుందని, అడ్డుకోవడానికి మీరెవరంటూ పోలీసులతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఉదయం నుంచి లోకేష్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
చివరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక పోలీసులు మధ్యాహ్నం అనుమతించడంతో కోనసీమ జిల్లాలోని పొదలాడ యువగళం క్యాంప్‌సైట్ నుంచి లోకేష్ విజయవాడ బయల్దేరారు. నంద్యాల నుంచి చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడకు రోడ్డుమార్గంలో పోలీసులు తీసుకొస్తున్నారు. విజయవాడలో చంద్రబాబును లోకేష్ కలవనున్నారు. ఈ కేసులోని తదుపరి పరిణామాలు, కార్యాచరణ గురించి చర్చించనున్నారు.