తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ప్రస్తుతం నీటిపారుదల ప్రాజెక్టుల చట్టూ తిరుగుతున్నాయి. ఒకవైపు భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నాయకత్వంలో ఆ పార్టీ నాయకులు మేడిగడ్డ సందర్శించగా మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేత వంశీచంద్ రెడ్డి సారథ్యంలో ఆ పార్టీ నేతలు పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు.మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలకు ఇటు అధికారపక్షమైన కాంగ్రెస్ అటు ప్రతిపక్షమైన భారత్ రాష్ట్రసమితి సన్నద్ధమవుతున్నాయి.దీంతో తెలంగాణలో ఇప్పటికే లోక్‌సభఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రెండు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రాజెక్టులు సందర్శించడంతో తెలంగాణ రాజకీయాలు మరింతగా వేడెక్కాయి.
తెలంగాణ రాజకీయాల్లో మేడిగడ్డ ప్రాజెక్ట్ కొంతకాలంగా హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లో భాగంగా మేడిగడ్డ బరాజ్‌ను నిర్మించారు. కిందటేడాది నవంబర్ నెలలో మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ 15వ స్తంభం నుంచి 20వ పిల్లర్ వరకు కుంగిపోయింది. బ్యారేజ్ -బీ బ్లాక్‌లో 19,20,21 వ పిల్లర్ల మధ్య వంతెన దాదాపు 30 మీటర్ల పొడవున ఒక ఫీటు వరకు కిందకు కుంగింది. ముఖ్యంగా బ్యారేజ్ -బీ బ్లాక్‌లో 19,20,21 వ పిల్లర్ల మధ్య వంతెన దాదాపు 30 మీటర్ల పొడవున ఒక ఫీటు వరకు కిందకు కుంగింది.
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన కుంగిపోవడం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. దీంతో మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ ప్రాజెక్ట్‌లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఆరోపించాయి. మేడిగడ్డ సంఘ టనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. 2018 నుంచి నీటిపారుదల శాఖను తన దగ్గరే పెట్టుకుని కేసీఆర్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైందని రేవంత్ రెడ్డి ఆరో పించారు. శాసనసభ ఎన్నికలకు ముందు మేడిగడ్డ ఎపిసోడ్ వెలుగు చూసింది. దీంతో తెలంగాణ రాజకీయాలన్నీ గరంగరం అయ్యాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మేడిగడ్డ ఎపిసోడ్‌పై స్పందించారు. ఏరియల్ వ్యూ ద్వారా మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించారు. మేడిగడ్డలో నాణ్యతా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. నీటిపారుదల ప్రాజెక్టుల పేరు చెప్పి గులాబీ పార్టీ సర్కార్ భారీ అవినీతికి పాల్పడిందని రాహుల్ ఆరోపించారు. టోటల్‌గా మేడిగడ్డ ఎపిసోడ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
మేడిగడ్డ బ్యారేజీని 2016 మే 26వ తేదీన నిర్మించారు. కాగా 2019 జూన్ 21న ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఎల్ అండ్ టీ సంస్థ ఈ వంతెనను నిర్మించింది. వాస్తవానికి నిర్మాణ దశలోనే బ్యారేజీలోని 20వ నెంబర్ పిల్లర్ వద్ద పగుళ్లు వచ్చాయి. అప్పట్లోనే ఈ పగుళ్లకు మరమ్మతులు చేసి పని పూర్తి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మేడిగడ్డ వంతెన కుంగిన సంఘటనపై కేంద్ర జలసంఘం తీవ్రంగా స్పందించింది. బ్యారేజ్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందచేయా ల్సిందిగా కేసీఆర్ నాయకత్వంలోని అప్పటి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిల్లర్లు కుంగిన సంఘటనపై సమగ్ర అధ్యయనానికి సహకరించాల్సిందిగా కేసీఆర్ సర్కార్‌ను సూచించింది. వంతెన కొంతమేర కుంగిన సంఘటనపై అధ్యయనానికి అనిల్ జైన్ చైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని కేంద్ర జలసంఘం ఏర్పాటు చేసింది.ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవాల పరిశీలనకు కేంద్ర జలసంఘం కమిటీ మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను సందర్శించింది. ఆ తరువాత ఢిల్లీకి వెళ్లిన ఆరుగురి కమిటీ 43 పేజీలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో తెలంగాణ సర్కారు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని నివేదికలో కమిటీ తెలియజేసింది. ఈ నేపథ్యలో మేడిగడ్డ వంతెన కుంగిపోయిన సంఘటనపై తమకు సమగ్ర సమాచారం ఇవ్వాల్సిందిగా గులాబీ పార్టీ నాయక త్వంలోని తెలంగాణ సర్కార్‌ను కేంద్ర జలసంఘం ఆదేశించింది.
కేంద్ర జలసంఘం ఆదేశాల మేరకు మేడిగడ్డ సంఘటనపై కేసీఆర్ సర్కార్ ఒక నివేదిక సమర్పించింది. అయితే ఈ వివరాల పట్ల కేంద్ర జలసంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తంగా ఇరవై అంశాలపై తాము వివరాలు కోరితే కేవలం మూడింటిపై మాత్రమే సమాచారం ఇచ్చిందని కేసీఆర్ సర్కార్ పై మండిపడింది కేంద్ర జలసంఘం. అలాగే లక్ష్మీ బ్యారేజ్‌కు సంబంధించి తాము కోరిన అనేక కీలక అంశాలపై కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ సర్కార్ సమాచారం ఇవ్వలేదని కేంద్ర జలసంఘం మండిపడింది.ఇదిలా ఉంటే మేడిగడ్డ ఎపిసోడ్‌పై గులాబీ పార్టీ నాయకుల వివరణ మరోలా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ ఘటనను సాకుగా చూపెడుతూ ప్రతిపక్షాలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే రాజకీయ కుట్రలు పన్నుతున్నాయని గులాబీ పార్టీ నేతలు ఎదురుదాడి చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మేడిగడ్డ పై రాద్ధాంతం చేస్తున్నాయని ప్రత్యారోపణలు చేశారు.
మేడిగడ్డ ఎపిసోడ్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అసెంబ్లీ వేదికగా మేడిగడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర శంఖం పూరించారు.మేడిగడ్డ బ్యారేజ్‌ను అడ్డం పెట్టుకుని కేసీఆర్ సర్కార్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని రేవంత్ ఆరోపించారు.ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని గులాబీ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దోపిడీ చేసిందన్నారు. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన రైతులకు మాత్రం ఎటువంటి న్యాయం జరగలేదని ఆయన ఆరోపించారు. దేవాలయాలు ఎంత పవిత్రమైనవో…నీటిపారుదల ప్రాజెక్టులు కూడా అంతే పవిత్రమైనవన్నారు రేవంత్. మేడిగడ్డ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనేక ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకలేదన్నారు రేవంత్ రెడ్డి. ఇదిలాఉంటే మేడిగడ్డ ఉదంతంపై భారత్ రాష్ట్ర సమితి ఎదురుదాడి చేస్తోంది. ఒక్క మేడిగడ్డ పిల్లర్లు కుంగినంతమాత్రాన మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరానిదంటూ ఆరోపణలు, విమర్శలు చేయడం సరికాదన్నారు. పిల్లర్లు కుంగితే మరమ్మతులు చేయిస్తే సరిపోతుందన్నారు.
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్దాంతం చేస్తోందని గులాబీ పార్టీ నేతలు ఘాటు ఆరోపణలు చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. కాళేశ్వరం వల్లనే ఆకలికేకల తెలంగాణ అన్నపూర్ణగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల తెలంగాణలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. కాళేశ్వరంపై వాస్తవాలు ప్రచారం చేయడానికే తాము చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు గులాబీ పార్టీ నేతలు. ఛలో మేడిగడ్డ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు కురిపించింది గులాబీ పార్టీ. తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులను గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాలు ధనయజ్ఞం చేశాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతుల సాగునీటి అవసరాలు తీర్చడానికే కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అద్భుతంగా నిర్మించిందన్నారు. కాళేశ్వరంపై జరుగుతున్న ప్రచారంలో ఏవి వాస్తవాలో…ఏవి అవాస్త వాలో ప్రజలు తెలుసుకోవాలన్నారు బీఆర్ఎస్ నేతలు. ఏమైనా కేసీఆర్ సర్కార్ ఎంతో గొప్పగా చెప్పుకునే మేడిగడ్డ ప్రాజెక్ట్ చివరకు వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ బృందం తాజాగా మేడిగడ్డ సందర్శించింది.