మంగళగిరిలో నేడు టీడీపీ జయహో బీసీ బహిరంగ సభ జరగనుంది. జనాభాలో సగానికి పైగా ఉండే వెనుకబడిన తరగతుల వారి సమగ్రాభివృద్ధికి చేపట్టవలసిన చర్యలతో టీడీపీ-జనసేన కూటమి బీసీ డిక్లరేషన్ రూపొందించింది. బీసీ డిక్లరేషన్ ను కూటమి విడుదల చేయనుంది. తెలుగుదేశం అధ్యక్షు డు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ బీసీ సాధికార కమిటీ ఛైర్మన్ కొల్లు రవీంద్రతో పాటు రెండు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు, కార్యకర్తలు సదస్సులో పాల్గొంటారు.
టీడీపీ ఆవిర్బావం నుంచి బీసీలు పార్టీకి బలమైన మద్దతుదారులుగా నిలబడ్డారని పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. బీసీల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టాల్సిన నిర్దిష్ట విధానాలు, చర్యలతో ఒక సమగ్ర బీసీ డిక్లరేషన్ ను చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు విడుదల చేస్తారని చెప్పారు. విస్తృత చర్చల ఆధారంగా ఈ డిక్లరేషన్ ను రూపొందించామని ఆయన అన్నారు. జయహో బీసీ సభను విజయ వంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.