స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సర్వే చేసినట్టు కనిపిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన సర్వేపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్వే లెక్కలకు, బయటి లెక్కలకు ఎంతో తేడా ఉందన్నారు. బీసీల జనాభా తగ్గినట్టు చూపించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేయొద్దని అన్నారు. రాహుల్ గాంధీ మాటలకు తెలంగాణ ప్రభుత్వం తీరుకు సంబంధం లేదని చెప్పారు.
కులసంఘాల భవనాలకు స్థలం కేటాయింపులోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందని పాయల్ శంకర్ ఆరోపించారు. హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో బీసీ సంఘాల భవనాలకు స్థలం కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రవర్ణాల వారి కులసంఘాల భవనాలకు మాత్రం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో కేటాయించారని చెప్పారు. బలహీనవర్గాల విషయంలో కేవలం తీర్మానాలు చేసి వదిలేస్తున్నారని ఆరోపించారు. ఈ సర్వేలో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని కొత్త పదాలు సృష్టించారని… కోర్టుల్లో కేసులు వేసి బీసీలకు రిజర్వేషన్ల పెంపును జాప్యం చేయాలని చూస్తున్నారని అన్నారు. కోర్టుల పేరు చెప్పి ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల పెంపును పక్కకు పెడుతోందని పాయల్ శంకర్ ఆరోపించారు.