పారిశ్రామికవేత్త రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన శంతను నాయుడు టాటా గ్రూప్‌లో కీలక పదవి లభించింది. టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్‌కు జనరల్ మేనేజర్‌గా శంతను నియమితులయ్యారు. ఈ విషయాన్ని తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో షేర్ చేస్తూ శంతను ఆనందం వ్యక్తం చేశారు.
జీవితం చివరిదశలో టాటాతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి శంతను నాయుడు. చనిపోవడానికి ముందు రతన్ టాటాకు కేర్‌టేకర్‌గా, జనరల్ మేనేజర్‌గా వ్యవహరించారు. తాజాగా ఆయనకు టాటా గ్రూప్‌లో కీలక పదవి లభించింది.
టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి తెల్ల షర్టు, నేవీ బ్లూ ప్యాంట్‌లో నా తండ్రి (రతన్ టాటాను ఉద్దేశిస్తూ) నడుచుకుంటూ ఇంటికి వచ్చేవారని పోస్టులో శంతను చెప్పారు. ఆ సమయంలో తాను ఆయన కోసం ఎదురుచూస్తూ కిటికీలో నుంచి చూసేవాడినని తెలిపారు. ఇప్పుడు తాను కూడా అలా నడిచొచ్చే రోజులు వచ్చాయని శంతను రాసుకొచ్చారు.
వీధి కుక్కలపై ఉన్న ప్రేమే రతన్ టాటాను, శంతను నాయుడుని కలిపింది. వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. టాటా ట్రస్ట్‌లో చిన్న వయసు ఉన్న వ్యక్తి శంతను. 2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంట్‌గా, కేర్ టేకర్ గా వ్యవహరించారు. రతన్ టాటాకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్నారు.
గతేడాది అక్టోబరులో రతన్ టాటా కన్నుమూశారు. ఆ సమయంలో శంతను తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన మార్గదర్శిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మీ నిష్క్రమణతో మన స్నేహంలో శూన్యం మిగిలింది. ఆ లోటును అధిగమించడానికి జీవితాంతం ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ దూరమవడంతో కలిగిన దుఃఖం పూడ్చలేనిది. గుడ్‌బై మై డియర్ లైట్‌హౌస్.. అని శంతను ఆవేదన వ్యక్తం చేశారు.