స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ముందస్తు బెయిల్ పై ఈనెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపాలని జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. అయితే అప్పటివరకు సీబీఐ అధికారులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది.
కాగా ఇప్పటికే మూడు సార్లు సీబీఐ విచారణకు అవినాశ్ హాజరుకాలేదు. తన తల్లికి అనారోగ్యంగా ఉందని కర్నూలు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. దీంతో సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేయడానికి కర్నూలులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును అవినాశ్ రెడ్డి ఆశ్రయించారు.