AP Politics: ఆంధ్రప్రదేశ్‌లోని ఈశాన్య దిక్కులో గల చిట్టచివరి జిల్లా శ్రీకాకుళం. ఈ ప్రాంతం గతం నుంచి కొంత వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకుంటారు. విశాఖపట్నం జిల్లాలో భాగంగా ఉండే ఈ జిల్లా 1950 ఆగష్టు 15వ తేదీన ప్రత్యేక జిల్లాగా అవతరించింది. ఎన్నో దర్శనీయ ప్రదేశాల నిలయంగా జిల్లా ఉంది. శ్రీముఖలింగం, అరసవెల్లి, శ్రీ కూర్మం వంటి పుణ్యక్షేత్రాలు ఈ జిల్లాలో ఉన్నాయి. అభివృద్ధిలో కొంత వెనుకబాటుతనం ఉన్నప్పటికి.. రాజకీయంగా ఇక్కడి ప్రజలు చైతన్యం కలిగి ఉంటారనే చెప్పుకోవాలి. చాలా ఎన్నికల్లో ఊహించిన దానికంటే భిన్నమైన ఫలితాలు ఈ జిల్లాలో కన్పించాయి. ముఖ్యంగా సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. గతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న సిక్కోలు జిల్లాలో.. ఆ పార్టీ నేతలు ఎక్కువమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. ప్రస్తుతం వైసీపీ కూడా జిల్లాలో తన ప్రభావాన్ని చాటుకుంటోంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఇచ్ఛాపురం, టెక్కలి మినహా మిగిలిన 6 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది.
గత ఎన్నికల్లో తెలుగుదేశం, వైసీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేయడంతో క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నప్పటికి.. కొంత ప్రభుత్వ వ్యతిరేకతతో తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో గెలుపొందింది. ఈ ఫలితాలు చూస్తే ఇక్కడి ప్రజల రాజకీయ చైతన్యం ఇట్టే అర్థమవుతోంది. గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీపై ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ఓ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో శాసనసభా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను ఈ జిల్లా ప్రజలు గెలిపించారు. అదే సమయంలో ఈ జిల్లాలో సుదీర్ఘకాలం ఎంపిగా పనిచేసి.. జిల్లా ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న దివంగత నేత కింజరపు ఎర్రనాయుడు కుటుంబానికి సంబంధించిన ఇద్దరిని సైతం గత ఎన్నికల్లో గెలిపించారు. శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి ఎర్రనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు, టెక్కలి శాసనసభా స్థానం నుంచి ఎర్రనాయుడు సోదరుడు అచ్చెన్నాయుడుని గెలిపించారు. ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే ఇక్కడి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అర్థం అవుతోంది.
ఈ జిల్లాలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా లేనప్పటికి.. యువత మాత్రం ఈసారి జనసేన వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జనసేన గెలిచే అవకాశాలు లేనప్పటికి ఇతర పార్టీల గెలుపును నిర్ణయించడంలో మాత్రం పవన్ కళ్యాణ్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కొంతమేర ప్రభుత్వ వ్యతిరేకత ఉండటంతో పాటు.. జనసేన వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే ఈ జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీచేస్తే ఈ జిల్లాలో కనీసం ఒకటి నుంచి రెండు నియోజకవర్గాలను జనసేనకు కేటాయించాల్సి వస్తుంది. పొత్తు ఫిక్స్ అయి జనసేనకు సీటు ఇవ్వాల్సి వస్తే పాతపట్నం, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఓ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన మాత్రం శ్రీకాకుళం, టెక్కలి సీట్లను ఆశిస్తున్నప్పటికి.. టెక్కలి నియోజకవర్గం నుంచి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆ సీటు కేటాయించే పరిస్థితి లేదు. అలాగే ఇచ్ఛాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఉండటంతో ఈ నియోజకవర్గాన్ని జనసేనకు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని.. ఇక ఎచ్చెర్లలో కిమిడి కళా వెంకట్రావు లేదా వారి కుటుంబానికే ఇక్కడి సీటు దక్కే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పలాస నుంచి గౌతు శిరీష పోటీలో ఉండటంతో పొత్తులో జనసేనకు ఈ నియోజకవర్గం కేటాయించే అవకాశాలు చాలా తక్కువ. ఆముదాలవలస నుంచి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీనే పోటీ చేయనుంది. ఇక్కడ కూన రవికుమార్‌కు తెలుగుదేశం పార్టీ టికెట్ కన్ఫర్మ్ అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ జనసేనతో పొత్తు అనివార్యమై.. జనసేన పలానా సీటు కావాల్సిందేనని పట్టుబడితే మాత్రం ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది వేచి చూడాలి.
పొత్తులు కుదిరి తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రస్తుతం ఉన్న సీట్ల కంటే సంఖ్య తగ్గే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక జిల్లాలో సామాజిక సమీకరణాలు చూసుకుంటే మాత్రం.. రెండు సామాజిక వర్గాలు ఈ జిల్లాలో బలంగా ఉన్నాయి. ఒకటి కళింగ సామాజికవర్గం కాగా.. రెండు వెలమ సామాజిక వర్గం.. దీంతో అన్ని పార్టీలు రిజర్వు నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల ఈ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులకే సీట్లను కేటాయిస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలతో పాటు.. వ్యక్తి యొక్క స్వభావం ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉన్న సమయంలోనూ టెక్కలి, ఇచ్ఛాపురంలో టిడిపి అభ్యర్థులు గెలిచారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మాత్రం జిల్లా ప్రజల తీర్పు గతంతో పోలిస్తే కొంత భిన్నంగానే ఉండే అవకాశం ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయానికి ఎలాంటి మార్పులు జరుగుతాయి.. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తేలాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే.