SSC Exams: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఇవాళ (ఏప్రియల్ ౩వ తేదీ) నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షలు జరగనుండగా.. 17, 18 తేదీల్లో ఓపెన్ స్కూల్ సొసైటీ, ఒకేషనల్ విద్యార్థుల పరీక్షలుంటాయి. 6లక్షల 9వేల 70 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. వారిలో బాలురు 3,11,329 మంది, బాలికలు 2,97,741 మంది ఉన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు 53,140 మంది, ఓపెన్ స్కూల్ విద్యార్థులు 1,525 మంది ఉన్నారు. వీరి కోసం 3,349 పరీక్ష కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. గతేడాది వరకూ ఏడు పేపర్ల విధానం అమల్లో ఉండగా, ఈసారి ఆరు పేపర్లతోనే పరీక్షలు జరుగనున్నాయి.
సైన్స్‌లో ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్‌కు ఈసారి ఒకే పరీక్ష నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు పీఎస్, ఎన్‌ఎస్‌కు కేటాయించిన వాటిలో మాత్రమే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సమస్యాత్మకంగా గుర్తించిన 104 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఈసారి విద్యార్థులతో పాటు సెంటర్ సూపరింటెండెంట్ సహా టీచర్లెవరూ సెల్‌ఫోన్లు తీసుకురాకుండా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రశ్నపత్రాలు లీకైతే ఎక్కడినుంచి బయటికొచ్చాయో కనిపెట్టే విధానాన్ని అమలుచేస్తున్నారు. ఉదయం 9గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది.
పరీక్షరాసే విద్యార్థులను ఉదయం 8 గంటల 45 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల లోపు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత అనుమతి ఉండదు. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమేరాలు, ఇయర్‌ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు పరీక్షా కేంద్రంలోనికి తీసుకెళ్లకూడదు. అత్యవసర పరిస్థితుల్లో మినహా మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలలోపు విద్యార్థులను బయటకు పంపించరు. వాటర్ బాటిల్, పెన్, పెన్సిల్, ఇతర స్టేషనరీని పరీక్షా కేంద్రంలోనికి తీసుకెళ్లవచ్చు