IPL 2023: ఐపిఎల్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. మొత్తం 10 జట్లు కాగా.. అన్ని జట్లు తమ మొదటి మ్యాచ్ ఆడాయి. ప్రారంభం నుంచి భారీ స్కోర్ మ్యాచ్‌లు చూస్తున్నాం. 2023లో అయినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన గ్రహస్థితిని మార్చుకుని.. విజయాల పరంపర కొనసాగిస్తుందని ఆశించిన.. తెలుగు క్రికెట్ అభిమానులకు నిరాశే ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే భారీ లక్ష్యాన్ని చేధించడంలో చేతులెత్తేసింది. కెప్టెన్లు మారినా, ఆటగాళ్లు మారినా…దాని రాత మాత్రం మారలేదు. బహుశా దక్షిణ దిక్కు వాస్తు బాగా లేదేమోనని కొందరంటుంటే, పేరులోనే ఏదో మిస్సయ్యిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. సొంత పిచ్, సొంత వాళ్ల మధ్య ఆడుతూ, ఆ ప్రోత్సాహాన్ని అందుకుంటూ కూడా నైరాశ్యంలోంచి బయటపడలేకపోవడం విచిత్రంగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
హైదరాబాద్ జట్టు పేరు చెబితేనే…ప్రత్యర్థుల్లో ఎక్కడ లేని ఆత్మస్థైర్యం వచ్చి…ఏ జట్టుపై ఆడలేనంతగా ఆడి భారీ స్కోర్ కొడుతున్నారు. బౌలర్లు కూడా కొడితే కొట్టుకోండ్రా..నా సాములూ…అన్నట్టు ఇంకా ఇంకా బ్యాట్ లపైకి బాల్స్ వేస్తున్నారు.
ఎవడి విల్ పవరు, హ్యాండ్ పవరు ఎంతుంటే అంత ఎత్తున ఎగరేసి మరీ కొడుతున్నారు. అలా మన హైదరాబాద్ జట్టు మళ్లీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మొదటి మ్యాచ్ నే ఇలా ముగిస్తే… మిగతా మ్యాచ్‌ల ఫలితం ఊహించవచ్చునని అంతా అనుకుంటున్నారు. ఆత్మవిశ్వాసం లోపించిందా? వ్యూహాలు పన్నలేకపోతున్నారా? సరైన కెప్టెన్ లేడా? ఎందుకు సన్‌రైజర్స్ ఇంత పేలవమైన ప్రదర్శన చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. రాబోయే మ్యాచ్‌లలో అయినా సన్‌రైజర్స్ తన ఆట తీరు మార్చుకోవాలని తెలుగు క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.