ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో నటుడు షాయాజీ షిండే భేటీ అయ్యారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే.. అది కూడా ప్రసాదంగా భావించి భక్తులు పెంచుతారని షాయాజీ షిండే అన్నారు. పచ్చదనం పెరుగుతుందనే తన ఆలోచనను డిప్యూటీ సీఎంకు షాయాజీ షిండే ఈ భేటీలో తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో షాయాజీ షిండే భేటీ అయిన ఫొటోలు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల షాయాజీ షిండే ఓ రియాల్టీ షో వేదికగా తన అమ్మతో జరిగిన సంభాషణను ప్రస్తావించారు. షియాజీ షిండే తల్లి 97లో కన్నుమూశారని.. అమ్మ తర్వాత తనకు భూమాత కూడా అంతే గుర్తొస్తుందని చెప్పారు. సాధారణంగా దేవాలయాలకు వెళ్లినప్పుడు ప్రసాదాలు పంచుతారు.. కానీ ప్రసాదంతో పాటు ఒక మొక్కను ఇస్తే బాగుంటుందిని చెప్పారు. దాన్ని భక్తులు తీసుకెళ్లి నాటితే అందులో భగవంతుడిని చూసుకోవచ్చని అన్నారు. మహారాష్ట్రలో మూడు దేవాలయాలలో తాను ఈ విధానం మొదలుపెట్టానని స్పష్టం చేశారు. అయితే, అందరికీ కాకుండా ఎవరైతే అభిషేకం చేస్తారో వారిలో సుమారు 100, 200 మందికి ప్రసాదంలాగా వీటిని ఇస్తారని షాయాజీ షిండే చెప్పుకొచ్చారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అపాయింట్‌మెంట్ ఇస్తే, తన ఆలోచనని ఆయనతో పంచుకుంటానని చెప్పారు. ఇలా చెప్పిన రెండు రోజుల్లోనే పవన్ నుంచి షాయాజీ షిండేకు పిలుపువచ్చింది. వెళ్లి ఆయనను కలిసి తన ఆలోచనను పంచుకున్నారు.