తెలంగాణలో నేడు DSC అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. LB స్టేడియం వేదికగా సాయంత్రం జరగనున్న కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులు అపాయింట్ మెంట్ లెటర్స్ అందుకోనున్నారు . 6 నెలల్లో డీఎస్సీ పోస్టుల భర్తీ పూర్తి చేసిన ప్రభుత్వం.. ఇవాళ నియామక పత్రాలు అందజేయనుంది. మొత్తం 11 వేల 62 ఉద్యోగాలకు 10 వేల 6 మంది అభ్యర్థులు అపాయింట్ మెంట్ లెటర్స్ తీసుకోబోతున్నారు.
స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోబోతున్నారు. కోర్టు కేసుల కారణంగా వెయ్యి 56 మంది అభ్యర్ధుల వెరిఫికేషన్ నిలిచిపోయింది. కోర్టు కేసులు పరిష్కారమయ్యాక మిగిలిన అభ్యర్థులకు కూడా అపాయింట్ మెంట్ లెటర్స్ అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలో 11 వేల 62 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 29న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 5 తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా DSC రాతపరీక్షలను నిర్వహించింది. గతనెల 30న DSC ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. దసరా పండుగ లోపు ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్ మెంట్ లెటర్స్ అందిస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ఇవాళ నియామకపత్రాలు అందజేయనున్నారు.