ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో గల్లంతైన 8 మంది ఆచూకీ కోసం పదో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. షిఫ్ట్‌ల వారీగా దాదాపు 120 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. జీపీఆర్ రాడార్ మార్కింగ్ డేటా వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో ఎండ్ పాయింట్ కీలకంగా మారింది. ఎండ్ పాయింట్ పూర్తిగా మూసుకుపోయినట్టు కనిపిస్తోంది. ఎండ్ పాయింట్ అవతల మరికొంచెం దూరం వరకు శిథిలాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎండ్ పాయింట్ నుంచి మరికొంత దూరం తవ్వితేనే అందరి ఆచూకీ తేలుతుందని అంటున్నారు అధికారులు.
అయితే ఎండ్ పాయింట్ తవ్వితే మరో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. టన్నెల్ లోపల బురద, టీబీఎం శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. లోకో ట్రైన్ ద్వారా శిథిలాల తొలగింపు అంశంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇవాళ రాత్రికి గాని కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ జరిగే అవకాశం లేదు.ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోని సంక్లిష్టత వల్లే ఈ రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమవుతుందని అధికారులు అంటున్నారు. 12 బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారని చెబుతున్నారు.
ఎన్జీఆర్‌ఐ ఇచ్చిన జీపీఆర్ డేటా ఆధారంగా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. మిగిలిన ఐదు ప్రాంతాల్లో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. నిన్న ఉదయం మార్కింగ్ దగ్గర తవ్విన తర్వాత జీపీఆర్‌తో స్కానింగ్ చేస్తే అక్కడ ఐరన్ పైపులను గుర్తించినట్టు తెలుస్తోంది. ఐదు స్పాట్లలో ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి.
అయితే ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘటనాస్థలిని సందర్శించారు. టన్నెల్ దగ్గర సహాయక చర్యలను పర్యవేక్షించారు. రెస్క్యూ ఆపరేషన్‌పై ఆరా తీశారు. ఏరియల్ వ్యూ ద్వారా టన్నెల్‌ను పరిశీలించారు. ఇక మంత్రులు జూపల్లి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి పనులను పర్యవేక్షించారు. అయితే జూపల్లి మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం కల్లా నలుగురి ఆచూకీ తెలుసుకునే అవకాశం ఉందని.. మరో నలుగురి ఆచూకీ కనుగొనటానికి మరో ఐదు రోజులు పడుతుందని చెప్పారు. అయితే ఇప్పటికీ కూడా ఒకరి ఆచూకీని కూడా కనుగొనలేకపోయారు. 10 రోజులుగా 8 మంది ఆచూకీ తెలియక బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారి కోసం ఎదురుచూస్తున్నారు.