సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసే ఆస్కార్ అవార్డుల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ‘అనోరా’కు అవార్డుల పంట పండింది. ఇది రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన చిత్రం. బాక్స్ ఆఫీసును షేక్ చేసింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో అనోరా అవార్డులను సొంతం చేసుకుంది. ‘ది బ్రూటలిస్ట్’లో నటనకు గానూ ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ.. ‘అనోరా’లో నటనకు మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. అనోరా డైరెక్టర్ సీన్ బేకర్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు.
ఇక ‘ఎ రియల్ పెయిన్’ చిత్రానికి కీరన్ కైల్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా.. ‘ఎమిలియా పెరెజ్’లో నటనకు జోయా సాల్దానా ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నారు. . డ్యూన్- పార్ట్2 గతేడాది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక డ్యూన్ పార్ట్ 2 కి ఉత్తమ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ వరించింది. భారత చిత్రానికి నిరాశే ఎదురైంది. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి నామినేషన్‌లో నిలిచిన ‘అనూజ’ చిత్రానికి మాత్రం నిరాశ ఎదురైంది. ఆ కేటగిరిలో ‘ఐయామ్ నాట్ ఏ రోబో’ ఉత్తమ లఘు చిత్రంగా అవార్డును గెలుచుకుంది.
లాస్ ఏంజెలెస్ డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగిన 97వ అకాడెమీ అవార్డుల వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతో పాటు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. నటీమణులు ఫ్యాషన్ ప్రపంచానికి సరికొత్త భాష్యం చెబుతూ ట్రెండీ దుస్తుల్లో మెరిశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆస్కార్ అవార్డుల వేడుకకు వచ్చిన అతిథులతో నటి, వ్యాఖ్యాత అమేలియా డిమోల్డెన్‌బర్గ్ చిట్‌చాట్ చేశారు. అరియానా గ్రాండే, సింథియా ఎరివో, డోజా క్యాట్, లిసా, క్వీన్ లతీఫా, రేయ్‌లు తమ ప్రదర్శనతో అలరించారు.