- తెల్లవారుజామున గుండెపోటుతో మృతి
- 1,200 చిత్రాలకు పైగా నటించిన చలపతిరావు
- చలపతిరావుకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు
- దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తోన్న నటుడు చలపతిరావు
- నటులు చలపతి రావు మృతికి టీడీపీ అధినేత సంతాపం
- చలపతి రావు మృతి బాధాకరం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్
తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చలపతిరావు హఠాన్మరణం చెందారు. ఈరోజు(ఆదివారం) ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దాదాపు 1,200లకు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. చాలా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి.. ప్రేక్షకుల మదిపై చలపతిరావు చెరగని ముద్ర వేశారు. చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు దర్శకుడు, నటుడు, నిర్మాతగా ఉన్నారు. రెండు రోజుల క్రితమే సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతిచెందగా.. ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
చలపతిరావు పూర్తి పేరు తమ్మారెడ్డి చలపతిరావు. 1944 మే 8న కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రులో గ్రామంలో జన్మించారు. చిన్నప్పుడే నాటకాలపై ఆసక్తి పెంచుకుని, స్నేహితులతో కలిసి వాటిని ప్రదర్శించేవారు. దానివల్ల చదువు సరిగా సాగలేదు. బాగా ఒడ్డు, పొడుగు ఉండటం వల్ల నాటకాల్లో కథానాయకుడిగా నటించేవారు. సీనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో చలపతిరావు సినీరంగ ప్రవేశం చేశారు. విలక్షణ నటుడిగా చలపతిరావుకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. విలన్‌గా, తండ్రిగా, అన్నగా వివిధ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు చలపతిరావు. యమజాతకుడు మూవీలో యముడిగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు.
1966లో గూడచారి 116 సినిమాతో ఆయన చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. నటుడు, నిర్మాతగా చలపతిరావు గుర్తింపు పొందారు. కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, రాష్ట్రపతి గారి అల్లుడు తదితర సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు. చలపతిరావు మృతిపై తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చలపతిరావు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరిస్తోన్న సీనియర్ నటుడు చలపతిరావును సినిమా వాళ్లు బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన దిగ్గజ నటుడు చలపతిరావు. సంపూర్ణ రామాయణం, యమగోల, డ్రైవర్ రాముడు, బొబ్బిలి పులి, ప్రేమకానుక, బొబ్బిలి బ్రహ్మన్న, ఖైదీ వంటి హిట్ చిత్రాల్లో చలపతి రావు నటించారు.
నటుడు చలపతి రావు మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. చలపతిరావు మృతి దిగ్భ్రాంతి కలిగించిందని ఆయన అన్నారు. టాలీవుడ్ రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం విషాదకరం అని తెలిపారు. 1000కు పైగా సినిమాల్లో నటించిన చలపతిరావు మృతి సినీ రంగానికి తీరని లోటు అని చెప్పారు. చలపతిరావు కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలియజేశారు.
చలపతి రావు మృతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరానికి ప్రతినిధులుగా ఉన్న నటులు ఒక్కొరుగా కాలం చేయడం చాలా బాధాకరం అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
చలపతి రావు ఆకస్మిక మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తన విలక్షణ నటనతో చలపతిరావు తెలుగు ప్రేక్షకులకు అభిమాన నటులు అయ్యారని తెలిపారు. ఆయన మరణం తెలుగు చిత్రరంగానికి తీరని లోటు అని చెప్పారు. చలపతి రావు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని రేవంత్ రెడ్డి తెలిపారు.