తెలంగాణలో ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. వాగు కనిపిస్తే చాలు… తవ్వేస్తున్నారు. రాత్రి ,పగలు అన్న తేడాలేకుండా యధేచ్ఛగా ఇసుక దందాకు తెగపడుతున్నారు. ఈ జిల్లా , ఆ జిల్లా అన్న తేడా లేకుండా ఇసుకాసురులు ఇసుక రీచ్ లను మింగేస్తున్నారు. దీంతో సర్కార్ ఖజానాకు గండికొడుతున్నారు.
తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, పాలమూర్ జిల్లాల్లో ఇసుక రీచ్ లు ఉన్నాయి. వీటిలో ఇసుక తవ్వాలంటే…. టిజీఎండీసీ అనుమతులు అవసరం. ఇసుక కొనుగోళ్ల ప్రక్రియ అంతా టిజీఎండీసీ ఆధ్వర్యంలో అది కూడా ఆన్ లైన్ లో జరగాలి. అయితే టిజిఎండీసీ వెబ్ సైట్ లో ఓపెన్ కాకుండానే… చాలా ఓట్ల ఇసుక తరలిపోతుంది. ఉమ్మడి కరీంనగర్ లోని తాడిచర్ల బ్లాక్ 1, తాడిచెర్ల బ్లాక్ 2 ఖమ్మపల్లి, ఉట్నూరు, సూర్యాపేట్ జిల్లా వంగమర్తి, ములుగు ఇలా… ప్రతి ఇసుక రీచ్ లనుండి ప్రతి రోజు వందల కొద్ది లారీలు ఇసుకను తరలిస్తున్నాయి. దొంగ బిల్లు, ఓవర్ లోడ్ లతో దోచేస్తున్నారు. ఇలా కోట్ల రూపాయల విలువైన ఇసుకను సాండ్ కేటుగాళ్ళు దోచుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతుండటంతో రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది.
ఇసుక ద్వారా సర్కార్ కు ఏడాదికి రూ. 6వేల కోట్లకు పైగా ఆదాయం రావాల్సి ఉంది. అంతేకాదు.. ప్రభుత్వం ఇందరిమ్మ ఇండ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇసుక అవసరం ఎంతో ఉంది. ఇలా విలువైన కొందరు దందాగా చేసుకోవడంపై సర్కార్ సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమా ఇసుక రవాణపై ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గత మైనింగ్ సమీక్షలతో ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి… దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు కూడా జారి చేశారు. అయినా… ఇసుక దందా కొనసాగుతుండటంతో ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇసుక రీచ్ లను తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఓవర్ లోడ్, అక్రమ రవాణా పై విజిలెన్స్ దాడులు చేపట్టాలని ఆదేశించిన సీఎం… ఇసుక అక్రమ దందాకు పాల్పడుతన్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్కార్ ఖజానాకు గండికొడుతున్న వారికి సహకరించవద్దని ప్రజా ప్రతినిధులకు సైతం గతంలోనే సీఎం సూచించిన సంగతి తెలిసిందే.
మొత్తానికి… రాష్ట్రంలో ఇసుక అక్రమా రవాణాను అరికట్టకపోతే…. ఇటు ఖజానాకు నష్టం కాకుండా ప్రభుత్వ ప్రాజెక్టుకు సైతం ఇసుక కొరత నెలకొనే ప్రమాదం ఉంది. దీంతో అలర్ట్ యిన రేవంత్ సర్కార్… ఇసుక దొంగల తాటా తీస్తామంటుంది. అయితే.. ప్రతి చోట ఇసుక దోపిడీ వెనక ఉన్న అధికారులు, రాజకీయ నాయకుల దందాలకు ప్రభుత్వం ఎలా బ్రేక్ వేస్తుందో వేచి చూడాలి.