తెలంగాణలో ఎన్నికలు ఇంకా పూర్తవలేదు..కానీ, ప్రగతి భవన్ పేరు మార్చేస్తామని అంటోంది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారో కూడా చెప్పేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇంతకీ వీళ్లంతా ఇలా ఎందుకు కామెంట్లు చేస్తున్నారు..? గెలుపుపై నమ్మకంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? లేక అత్యుత్సాహంతో మాట్లాడుతున్నారా ? దీనిపైనే ఇప్పుడు అందరిలోనూ చర్చ జరుగుతోంది.
నిజానికి కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు కామెంట్లు చేస్తున్నారన్నది ఓసారి పరిశీలిస్తే.. పార్టీ నేతలు, కేడర్‌లో నమ్మకం కలిగించడం కోసమేనన్నది బలంగా విన్పిస్తోంది. ఎందుకంటే గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. వాస్తవానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఆ క్రెడిట్ దక్కించుకోవడంలో హస్తం పార్టీ విఫలమైంది. దీంతో.. ఇచ్చింది కాంగ్రెస్సే అయినా మెడలు వంచి తామే తెచ్చామని చెబుతూ రాష్ట్రంలో రెండు సార్లు వరుసగా అధికారాన్ని దక్కించుకుంది గులాబీ పార్టీ. అంతేకాదు.. మరోసారి హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లూరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేతలు, కేడర్ నైతికంగా స్థైర్యం కోల్పోకుండా చివరి వరకు ఎన్నికల్లో పోరాడాలన్నది అగ్రనేతల ప్లాన్.
ప్రగతి భవన్ పేరును ప్రజా పాలన భవన్‌గా మార్చేస్తామన్న రాహుల్..అక్కడితో ఆగలేదు. మరో అడుగు ముందుకేశారు. తమ ప్రభుత్వంలో సీఎం ఎవరైనా నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటారని చెప్పుకొచ్చారు. ప్రజా దర్బార్‌ను ముఖ్యమంత్రి నిర్వహిస్తారంటూ నాటి వై.ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేశారు. ఇక, రేవంత్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకేసి ఎప్పుడు, ఎక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేది అన్నదానిపై ఆయా సభల్లో బహిరంగ వేదికలపైనే చెబుతున్నారు.
ఇక్కడే ఒక కీలక విషయం దాగుంది. కర్ణాటక ఎన్నికల ముందు వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. అయితే.. బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బీజేపీ తప్పించడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి రావడం, రేవంత్ దూకుడు అన్నీ ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. దీంతో.. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉన్న పరిస్థితి కాస్తా, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మారింది.
దీనికితోడు కాంగ్రెస్ పార్టీలో ఉండే పలువురు వృద్ధ నేతలకు, ఎక్కువసార్లు ఓడిపోయిన కొందరు లీడర్లకు టికెట్ల విషయంలో నో చెప్పేలా చేయడంలో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి సఫలమయ్యారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ తరఫున సుమారు 30 మంది వరకు యువతరం నేతలు తెరపైకి వచ్చారు. ఇది యువకుల్లో ఉత్సాహం నింపుతుందని అంటున్నారు. ఎన్నికల్లో ఇదో ప్లస్ పాయింటని అంటున్నారు.
వీటికి తోడు ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఇతర పార్టీల్లో ఉన్న నేతల్ని ఆకర్షించడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలసి వచ్చేదేనన్న భావన వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఏదైనా పార్టీకి సానుకూల వాతావరణం ఉంది అని తేలినప్పుడు మాత్రమే రాష్ట్రం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల నుంచి వలసలు ఉంటాయి. ఇతర పార్టీల నుంచి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, తుమ్మల, పొంగులేటి సహా మరి కొందరు కీలక నేతలు హస్తం గూటికి చేరడం ఇందులో భాగమేనన్న వాదన విన్పిస్తోంది.
మొత్తంగా..కేడర్‌లో నైతిక స్థైర్యం నింపడంతోపాటు ప్రజల్లోకి సానుకూల సంకేతాలు పంపడంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు చేస్తున్న ఈ వ్యాఖ్యలు రానున్న ఎన్నికల్లో ఎంత మేరకు కలిసి వస్తాయన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.