అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద రిలీఫ్ దొరికింది. స్కిల్ కుంభకోణంలో సెప్టెంబర్ 9న అరెస్టైన చంద్రబాబుకు బెయిల్ విషయంలో పలుమార్లు కోర్టుల్లో చుక్కెదురైనా ఇవాళ ఏపీ హైకోర్టులో మాత్రం భారీ ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి. మల్లిఖార్జున రావు తీర్పునిచ్చారు.
వాస్తవానికి చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై ఈనెల 17న వాదనలు ముగిశాయి. దీంతో తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఇవాళ తీర్పు వెల్లడించింది. ఈనెల 28న చంద్రబాబు రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి తెలిపారు. అయితే.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సమయంలో విధించిన షరతులు ఈనెల 28 వరకు వర్తిస్తాయని.. 29 నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని చెప్పారు. అయితే..ఈనెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని ఆదేశించారు న్యాయమూర్తి. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
అంతకుముందు ఈనెల 17న చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టులో వాడీవేడి వాదనలు సాగాయి. రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోందని వాదించారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు. పోలీసులు చట్టానికి విధేయులై ఉండాలే తప్ప రాజకీయ నేతలకు కాదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశ పూర్వకంగా తప్పుడు కేసులు నమోదు చేశాయని, బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అయితే.. అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి ర్యాలీ నిర్వహించి కోర్టు షరతులను ఉల్లంఘించారని సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఈ విషయంలో బేగంపేట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఇతర నిందితులకు బెయిల్ మంజూరైందన్న కారణంతో పిటీషనర్‌కు బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు కోరడం సరికాదని కోర్టుకు పొన్నవోలు విన్నవించారు.