ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కోటాను కోట్ల రూపాయల నగదు దొరుకుతోంది. సరైన పత్రాలు లేకుండా తీసుకెళుతున్న గుట్టలకొద్దీ డబ్బు, మద్యం, ఉచితాల పేరుతో పంచే సామాగ్రిని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది ఎన్నికల సంఘం. వీటి విలువ దాదాపు 1760 కోట్ల మేర ఉంటుందని వెల్లడించింది. అయితే.. ఇలా పట్టుబడిన వాటిలో అత్యధికం తెలంగాణ నుంచి స్వాధీనం చేసుకున్నవే కావడం గమనార్హం.
ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి అడ్డుకట్టే వేసే విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది ఎన్నికల సంఘం. దీంతో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. దీంతో.. అక్టోబర్ 9న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నగదు, ఇతరత్రా సామాగ్రి పట్టుబడుతోంది.
ఈసీ లెక్కల ప్రకారం తెలంగాణలో సీజ్ చేసిన వాటిలో ఒక్క నగదు విలువే 225 కోట్లు ఉంది. 86 కోట్ల విలువైన మద్యం, వంద కోట్లకు పైగా విలువైన మాదక ద్రవ్యాలు, 190 కోట్ల మేర బంగారం, వెండి ఆభరణాలు, 52 కోట్ల విలువ చేసే ఉచిత కానుకలను పట్టుకున్నారు సిబ్బంది. వీటి మొత్తం విలువ సుమారు 660 కోట్ల మేర ఉంటుందని లెక్కలు తేల్చారు అధికారులు.
2018లో ఇవే రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. సీజ్ చేసిన మొత్తం సుమారు 240 కోట్లు. ఆ లెక్కన చూస్తే ఇప్పటి వరకు పట్టుబడింది ఏడు రెట్లు ఎక్కువని అంచనా. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసేందుకు సమయం ఇంకా ఉంది. దీంతో.. ఈ విలువ మరింత పెరగవచ్చన్న వాదన వినిపిస్తోంది.