స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. ఈ ఘటన నగరంలోని బాలానగర్‌లో చోటుచేసుకుంది. బాలానగర్ నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఐడీపీఎల్ సమీపంలోకి రాగానే ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపి కిందికి దిగాడు. అనంతరం కొద్ది నిమిషాల్లోనే మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు నిలిపిన చోట పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. అటుగా వెళ్తున్న వాహనాలు రోడ్డుపైనే ఆగిపోవడంతో రెండు గంటలకుపైగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.