ఎస్సీ వర్గీకరణకు తొలి అడుగు పడింది. తొమ్మిది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశంపై మళ్లీ కదలిక మొదలైంది. వర్గీకరణ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా అధికారులను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. ఈనెల 11న జరిగిన ఎమ్మార్పీఎస్ విశ్వరూప సభలో ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోడీ నిలబెట్టుకున్నారు.
ఎస్సీ వర్గీకరణ ఫైల్ బూజు దులపడానికి ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమయ్యారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఫైల్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉంది. అయితే తాజాగా ఎస్సీ వర్గీకరణ అంశంపై మరోసారి కదలిక ప్రారంభమైంది.
షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కు సంబంధించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపింది. ఇందుకు సంబంధించి ప్రాసెస్‌ను వేగవంతం చేయవలసిందిగా కోరుతూ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్‌గౌబను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. అసలు ఏ అధికారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు కావాలి, ఈ కమిటీలో సభ్యులుగా ఎవరెవరు ఉండాలి, కమిటీలో ఎంత మంది ఉండాలి…ఈ అంశాలన్నిటినీ సాధ్యమైనంత త్వరగా అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేయాల్సిందిగా కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కాగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 11న జరిగిన ఎమ్మార్పీఎస్ విశ్వరూప సభకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడుతూ వర్గీకరణ కోసం మంద కృష్ణ ఆధ్వర్యంలో మూడు దశాబ్దాలుగా నడుస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వర్గీకరణ కు మార్గం సుగమం చేయడానికి వీలుగా కమిటీని ఏర్పాటు చేస్తామని విశ్వరూప సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, గతంలో ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోడీ నిలబెట్టుకున్నారు. హామీ ఇచ్చిన రెండు వారాల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోడీ మాట నిలబెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే విశ్వరూప మహాసభలో ఒక అరుదైన సంఘటన జరిగింది. వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ పక్కన కూర్చున్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మందకృష్ణ ఎమోషనల్ అవడాన్ని గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆయనను భుజం తట్టి ఓదార్చారు. దీంతో మందకృష్ణ మరింతగా భావోద్వేగానికి గురయ్యారు. మందకృష్ణ కన్నీళ్లు చెమర్చారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆయనను అక్కున చేర్చుకుని ఓదార్చారు.
అంతకుముందు ప్రసంగించిన మందకృష్ణ, ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. అభివృద్ధికే నరేంద్ర మోడీ ప్రాధాన్యం ఇస్తారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏది చెబితే అది చేసి చూపిస్తారని మందకృష్ణ ప్రశంసించారు.నరేంద్ర మోడీయే మాదిగల ఆకాంక్షలు నెరవేర్చగలరన్న నమ్మకం తనకుందన్నారు.
కమిటీ ఏర్పాటు కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న చొరవ ప్రభావం తెలంగాణ ఎన్నికలపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీల్లో మాదిగ ఉప కులం జనాభా ఎక్కువ. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బీజేపీకి మాదిగ ఉపకులం అండగా నిలబడటం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దాదాపు 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో మాదిగ ఉపకులం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలంగాణలో కొంతకాలంగా బీఆర్‌ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ వ్యతిరేక పవనాలు కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ గా మారుతుందన్న ప్రచారం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గులాబీ పార్టీ సర్కార్ వ్యతిరేక ఓటు చీలిపోతుందన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఎస్సీ వర్గీకరణ డిమాండ్ చాలా కాలంగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ 2014 నవంబరు 29న ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపింది. అప్పటి నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో వర్గీకరణకు ప్రధాని నరేంద్ర మోడీ చొరవ చూపారు. నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
ఎస్సీల వర్గీకరణ కోసం పోరాడుతున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిది ముప్ఫయి ఏళ్ల చరిత్ర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994 జులై ఏడో తేదీన మందకృష్ణ నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటైంది. బీసీల తరహాలోనే ఎస్సీ రిజర్వేషన్లను కూడా ఏ,బీ,సీ డీ లుగా వర్గీకరించి అభివృద్ధి ఫలాలకు నోచుకోని వర్గాలకు న్యాయం చేయాలన్నది ఎమ్మార్పీఎస్ ప్రధాన డిమాండ్.