ఒకరు కాదు..ఇద్దరు కాదు..అంతకంటే ఎక్కువే. అవును.. ఎన్నికల వేళ పలువురు కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు జరగడం కలకలం రేపుతోంది. అయితే..ఇవి కేవలం రాజకీయ కక్ష సాధింపులే తప్ప మరోటి కాదంటున్నారు ఆయా దాడులను ఎదుర్కొన్న బాధిత అభ్యర్థులు. కేవలం ఇవి పొలిటికల్‌గా తమను దెబ్బకొట్టేందుకు చేసినవి అని నిరూపించేందుకు తగిన సాక్ష్యాధారాలను సైతం ఈ సందర్భంగా పలువురు నేతలు చూపుతున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జి. వివేక్, వినోద్, మధు యాష్కీ ఇళ్లపై పెద్ద ఎత్తున ఐటీ సోదాలు జరిగాయి. ఈ లిస్ట్‌లో మరికొందరు సైతం ఉన్నారు. గంటల కొద్దీ జరిగిన ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు, ఆధారాలు, హార్డ్ డిస్క్‌లు, ఓ మోస్తరుగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి ఆయా ప్రభుత్వ విచారణా సంస్థలైన ఐటీ, ఈడీ.
అయితే..ఈ దాడులను తీవ్రస్థాయిలో ఖండించారు కాంగ్రెస్ పార్టీ నేతలు. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక ఆయనతో టచ్‌లోకి వెళ్లారు బీజేపీ నేతలు. పలు ఆఫర్లు సైతం ఇచ్చారు. అయితే..ఏమైందో తెలియదు కానీ, ఆయన కాంగ్రెస్‌లో చేరిపోయారు. పాలేరు అభ్యర్థిగా రంగంలో నిలిచారు. అంతే.. ఆయనపై ఖమ్మం, హైదరాబాద్ సహా పలు చోట్ల ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. దీనిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు పొంగులేటి. కమలంలో పార్టీలోకి వెళ్లకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
ఇక, జి వెంకటస్వామి కుమారులైన జి వివేక్, వినోద్‌ల విషయంలోనూ ఇదే జరిగింది. ఇరువురూ బీజేపీకి గుడ్‌బై చెప్పి హస్తం పార్టీ తీర్థం ఇటీవలె పుచ్చుకున్నారు. అంతే, వారిపైనా ఐటీ, ఈడీ పంజా విసిరింది. వందకోట్ల లావాదేవీలను వీళ్లు అకౌంట్లలో గుర్తించారని సమాచారం. అయితే..నిన్న మొన్నటి వరకు బీజేపీలో ఉండి ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్న ఈటెల రాజేందర్‌కు కోట్లాది రూపాయల అప్పు ఇచ్చినట్లు వాటిని చెక్కు రూపంలోనే చెల్లించినట్లు వెల్లడించారు వివేక్. మరి..పార్టీ మారిన వెంటనే వీటి విషయంలో వివరాలడిగిన ఐటీ, ఈడీ.. వాటిని తీసుకున్న రాజేందర్ విషయంలో ఎందుకు నోటీసులు ఇవ్వలేదన్న ప్రశ్న తలెత్తుతోంది.
అంతేకాదు..కేవలం కాంగ్రెస్ అభ్యర్థులే టార్గెట్‌గా జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులు ఇతర పార్టీల అభ్యర్థుల విషయంలో ఎందుకు అంత తీవ్రస్థాయిలో లేవన్న ప్రశ్న లేవనెత్తుతున్నారు బాధితులు.