స్వతంత్ర వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఈ జంట ఒకరు. ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉపాసనకు ఓ ఊహించని బహుమతి అందింది. ఆ గిఫ్ట్‌ను ఆమె సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన సోషల్‌మీడియా ఇన్‌స్టాలో తమ బిడ్డ కోసం చేయించిన ఊయల గురించి పలు విశేషాలను షేర్ చేశారు. తమకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రజ్వలా ఫౌండేషన్ సంస్థ ఓ ప్రత్యేకమైన ఊయలను కానుకగా ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఊయల ప్రాముఖ్యతను దాన్ని తయారుచేసిన విధానాన్ని వివరించారు.సెక్స్ ట్రాఫికింగ్‌లో చిక్కుకొని బయటపడిన మహిళలకు.. ప్రజ్వల ఫౌండేషన్ ఉపాధితో పాటు ఆశ్రయం కల్పిస్తోంది. వారిలోని కొందరు మహిళలే ఈ ఊయలను తయారు చేశారని ఉపాసన చెప్పారు. వారు తయారు చేసిన ఈ ఊయల.. ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. “అతి త్వరలో మేం ముగ్గురం కాబోతున్నాం. నా బిడ్డ కోసం మీరు చేతితో తయారు చేసి ఇచ్చిన ఈ ఊయల ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుందని భావిస్తున్నాను. ఇది వారిలోని ధైర్యం, బలం, ఆత్మగౌరవం ఆశకు ప్రతీకగా నా బిడ్డకు గుర్తుండిపోతుంది. మా అందమైన ప్రయాణంలో అంతర్భాగమైనందుకు ప్రజ్వల ఫౌండేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు” అని ఉపాసన రాసుకొచ్చారు.