స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగురాష్ట్రాల్లో మరో రెండు రోజులు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 478 మండలాల్లో వడగాలులు వీస్తున్నాయి. పార్వతీపురం మన్యం 44.87 డిగ్రీలు, విజయనగరం 44, అనకాపల్లి 43.9, అల్లూరి 42.7, తూర్పుగోదావరి 42.5, ఏలూరు 42.2, ఎన్టీఆర్ 41.9, విశాఖపట్నం 41.3, గుంటూరు 41, బాపట్ల 41, పలనాడు 41 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. మరో రెండ్రోజుల పాటు కోస్తాంధ్రలో హీట్ వేవ్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఇక తెలంగాణలో ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే విధంగా కుమురం భీం, నిర్మల్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక మరోవైపు ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ రాయలసీమ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.