చేనేత వారసత్వం పేరిట హైదరాబాద్‌లో 72వ ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించడాన్ని పీఓడబ్ల్యూ సంధ్య తప్పుబట్టారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తున్నామంటూ తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే కుట్ర జరుగుతోందని ఆమె విమర్శించారు. ఈ పోటీల నిర్వహణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామికంగా తెలంగాణ సాధించుకున్న పోరాటాలగడ్డ తెలంగాణ అని, ఈ ఉద్యమగడ్డపై ప్రజా ఉద్యమాల జాతీయ సభలు ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానిస్తున్నాం అన్నారామె. కానీ ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అన్నారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం రాహుల్ గాంధీ యాత్రలు చేస్తుంటే.. రేవంత్ అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ఆ పార్టీ ఇచ్చిన హామీలను ప్రణాళిక బద్ధంగా అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమవుతున్నారని సంధ్య విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనా విధానం మార్చుకోవాలని సంధ్య సూచించారు. ప్రపంచ సుందరి పోటీల నిర్వహణ నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు. లేదంటే నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.