గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసు కస్టడీ ముగియడంతో ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులు లక్ష్మీపతి, శివరామకృష్ణలను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కస్టడీలో పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే తనపై పెట్టిన కేసుకు, తనకు సంబంధమే లేదని జడ్జికి తెలిపాడు వంశీ. కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని వంశీ న్యాయమూర్తికి తెలిపాడు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పాడు. అందుకే వేరే బ్యారక్‌లో వసతి కల్పించాలని న్యాయమూర్తిని కోరాడు. అయితే ఒక్కడినే కాకుండా మిగతా ఖైదీలతో కలిపి ఉంచాలని విన్నవించాడు. దీనిపై మెమో దాఖలు చేయలని వంశీకి కోర్టు సూచించింది. ఈ సందర్బంగా వల్లభనేని వంశీ మెడికల్ రిపోర్టులను కోర్టుకు సమర్పించారు పోలీసులు.
వల్లభనేని వంశీ మూడు రోజుల పోలీసుల కస్టడీ ముగిసింది. దీంతో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కస్టడీ పూర్తయ్యక కోర్టులో ప్రవేశపెట్టాలని ఎస్సి. ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కస్టడీ పూర్తయ్యాక నిందితులని వైద్య పరీక్షల అనంతరం కోర్టుకి తీసుకొచ్చారు పోలీసులు. వంశీతో పాటు ఇదే కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు ఇప్పటికే రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం.
సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో మూడు రోజుల పాటు వేరు వేరుగా ముగ్గురినీ ముగ్గురు ఏసీపీ అధికారులు విచారించారు. తనకు కిడ్నాప్ కేసుతో ఏ సంబంధం లేదని విచారణలో వంశీ చెప్పినట్టు తెలుస్తోంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్,సీసీ ఫుటేజ్‌తో పాటు పలు కీలక వివరాలను ముగ్గురు నిందితుల ముందు ఉంచి పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.