అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో సినీ నటుడు, వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణమురళికి వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. పీహెచ్‌సీ డాక్టర్ గురు మహేష్ మాట్లాడుతూ.. పోసాని కృష్ణ మురళి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. బిబి షుగర్ పల్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయన్నారు. గుండెకు సంబంధించి సమస్య ఉన్నా ఏమీ డేంజర్ లేదని చెప్పారు. పోసానికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించామన్న డాక్టర్.. పోసాని అన్ని విధాలుగా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు.
వైసీపీ లీగల్ సెల్ లాయర్ నాగిరెడ్డి.. పోసాని తరపున ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అయితే ఉన్నతాధికారుల అనుమతి లేకుండా లోపలికి పంపలేమని సీఐ చెప్పడంతో ఆయన వెనుదిరిగారు. ఈ సందర్బంగా లాయర్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. పోసాని కృష్ణమురళిని కలిసేందుకు పోలీస్ స్టేషన్ కి వచ్చానని చెప్పారు. పోలీసులు ఆయనతో మాట్లాడేందుకు అనుమతి లేదని అంటున్నారని.. చెప్పారు. పోసానిపై పెట్టిన కేసులన్నీ కోర్టులో కొట్టి వేయిస్తానని స్పష్టం చేశారు. సాయంత్రం జడ్జ్ ఎదుట కూడా తమ వాదనలు కూడా వినిపిస్తామని తెలిపారు. పోలీసులు పోసాని కృష్ణ మురళిపై అక్రమ కేసులు పెట్టారని… ఆయనకు బెయిల్ వస్తుందని లాయర్ నాగిరెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్‌లో పోసాని అరెస్ట్
పోసాని కృష్ణమురళిని నిన్న రాత్రి హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలో ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయచోటి పోలీసులు రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏపీకి తరలించారు. కాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.
పోసాని కృష్ణమురళిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కులాల పేరుతో దూషించడం..ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై కేసు నమోదైంది. ఆయనపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.