రతన్‌టాటా మంచి మనసును మరోసారి గుర్తు చేసుకుంది యావత్ భారతం. ఇందుకు కారణం ఆయన చూపిన ఉదారతే. నిజమే.. రతన్ టాటా రాసిన వీలునామాలో తన పెంపుడు కుక్కకు సైతం వాటా ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నో ఏళ్లపాటు తనకు తోడుగా ఉన్న పెంపుడు కుక్క టిటో సంరక్షణ కోసం అంటూ తన ఆస్తుల్లో కొంత వాటా ఇచ్చారు రతన్ టాటా. ఆ మూగజీవిని ఎలా చూసుకోవాలో చెబుతూ ఏకంగా నిబంధనలే రూపొందించారాయన.
రతన్ టాటా జీవించి ఉన్న రోజుల్లో మూగజీవాల పట్ల ఆయన ఎంతో కరుణ చూపేవారు. ప్రత్యేకించి వీధి శునకాలపై ఆయన చూపించే ప్రేమ అపారమైనదనే చెప్పాలి. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన వాటి రక్షణకు ఎంతో పాటుపడేవారు. అలాంటి రతన్ టాటా.. తన వీలునామాలో పెంపుడు కుక్కకు వాటా కేటాయించడంతో మరోసారి అందరూ టాటా మంచి మనసును గుర్తుచేసుకుంటున్నారు.